బాలయ్య బైకుకు పార్టీ రంగు...రూ. 20 లక్షల ఖర్చు!
హైదరాబాద్: నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో 'లెజెండ్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలసిందే. ఈ చిత్రం కోసం రూ. 20 లక్షల ఖర్చుతో హార్లే డేవిడ్‌సన్ బైకు ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. సినిమాలోని ఓ పాటలో బాలయ్య ఈ బైకుపై కనిపించనున్నారు.
బాలయ్య స్వయంగా కోరడంతో పసుపురంగు బైకును కొనుగోలు చేసారట. ఆయన ప్రత్యేకంగా పసుపు రంగు ఎంచుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. త్వరలో సినిమాలకు స్వస్తి చెప్పి తెలుగు దేశం పార్టీలో రాజకీయ జీవితం మొదలు పెట్టనున్న బాలయ్య తన రాజకీయ ప్రవేశానికి గుర్తుగానే ఈ పసుపు రంగు బైకును ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే....దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని బాలయ్య రాజకీయ భవిష్యత్‌కు ఉపకరించేలా రూపొందిస్తున్నాడట. బాలయ్య అభిమానులను, తెలుగు దేశం పార్టీలను అలరించేలా సినిమాలో డైలాగులు ఉంటాయని, కొన్ని సన్నివేశాలు కూడా బాలయ్య అభిమానుల్లో జోష్ నింపే విధంగా ఉంటాయని టాక్.
వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్రలో కనిపిస్తారు. పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలకు పెద్ద పీట వేసారు దర్శకుడు బోయపాటి శ్రీను.
ఈ చిత్రంలో బాలకృష్ణ సరికొత్తగా కనిపిస్తారు. ఆయన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన బుల్లెట్ బైక్, సఫారీ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సినిమా షూటింగ్ మొత్తాన్ని సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం, అందుకు బాలకృష్ణ కూడా ఎంతగానో సహకరిస్తున్నారని చిత్ర నిర్మాతలు తెలిపారు. దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ...'ఈచిత్రంపై అభిమానులకు భారీ అంచనాలు ఉండటం సహజం. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గని విధంగా ఈచిత్రం రూపుదిద్దుకుంటోంది' అన్నారు.


Click it and Unblock the Notifications












