అవును నిజమే: పొలిటికల్ సెటైర్లపై బాలయ్య
బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం 'అధినాయకుడు' జూన్ 1న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈచిత్రంలో భారీగా పొలిటికల్ సైటర్లు ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. జాతీయ మీడియాలో సైతం ఈ విషయమై చర్చ సాగుతోంది. ఆ డైలాగులకు అంత హైప్ రావడానికి కారణం అవి జగన్‌ను, ఇతర హీరోల అభిమానులను ఉద్దేశించి ఉండటమే.
ఈ నేపథ్యంలో బాలయ్య సోమవారం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందించారు. 'అధినాయకుడు' సినిమాలో పొలిటికల్ సెటైర్లు ఉన్న మాట వాస్తవమే అన్నారు. అవి సినిమా స్టోరీలో భాగమే అన్నారు. జగన్ ఉద్దేశించినట్లుగా ఉన్న 'మంచి నాయకులు ప్రజల గుండెల్లో ఉండాలి...రోడ్డు మీద బొమ్మల్లోకాదు, విగ్రహాల రాజకీయం' అనే డైలాగ్ గురించి ప్రశ్నించగా జగన్ విగ్రహాల రాజకీయం చేస్తున్నాడని కాంగ్రెస్ నాయకులే అంటున్నారని సమాధానం ఇచ్చారు. తప్పు చేశాడు కాబట్టే జగన్ అరెస్టయ్యాడని వ్యాఖ్యానించారు.
బాలయ్య వ్యాఖ్యలను బట్టి రాజకీయాలను తన సినిమాల ద్వారా ఎండగట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. భవిష్యత్‌లో ఆయన తెలుగుదేశం పార్టీ తరుపు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో తన సినిమాల ద్వారా ఇప్పటి నుంచే అందుకు పునాదులు వేసుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది. అభిమానాన్ని రెచ్చగొడితే తట్టుకోలేవు అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ కూడా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
అధినాయకుడు చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహించారు. ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మాత. లక్ష్మి రాయ్, సలోని హీరోయిన్లుగా నటించారు. బాలయ్య తొలి సారిగా ఈచిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్నారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎమ్మెస్‌నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.


Click it and Unblock the Notifications











