విశ్వక్‌ది నాదీ అలాంటి రక్తం.. ముగ్గురు హీరోలతో మోక్షజ్ఞ: మొత్తానికి క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ
తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ టాప్ హీరోగా వెలుగొందుతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. గతంలో కంటే ఇప్పుడు వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతోన్న ఆయన.. ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు.
దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. అదే సమయంలో చిన్న సినిమాలకు సైతం ఆయన అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా ఈవెంట్‌కు హాజరయ్యారు. ఇందులో బాలయ్య.. విశ్వక్ సేన్‌పై, మోక్షజ్ఞ ఎంట్రీపై కామెంట్స్ చేశారు. ఆ వివరాలను మీరే చూసేయండి!

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ
వరుస హిట్లతో దూసుకుపోతోన్న విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రమే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. కృష్ణ చైతన్య తీసిన సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్.. అంజలి కీలక పాత్రలో నటించారు.

గ్రాండ్ ఈవెంట్.. బాలయ్యతో
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీని మే 31వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా హైదరాబాద్ నగరంలో నిర్వహించారు. దీనికి నటసింహా నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. దీంతో ఈ ఈవెంట్ ఎంతో సక్సెస్‌ఫుల్‌గా జరిగింది.

మమ్మల్ని కవలలు అంటారు
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. 'నా సోదరుడు విశ్వక్ సేన్ గురించి ముందుగా చెప్పాలి. నేను, విశ్వక్ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా.. బయట చూస్తే ఎవరైనా మమ్మల్ని కవలలే అంటుంటారు. సినీ పరిశ్రమలో నేను కొంత మందితోనే చాలా క్లోజ్‌గా ఉంటాను. అందులో విశ్వక్ సేన్ ఒకడు' అని చెప్పారు.

మా ఇద్దరిదీ ఉడుకు రక్తమే
ఆ తర్వాత బాలయ్య కంటిన్యూ చేస్తూ.. 'విశ్వక్ సేన్ సినీ ప్రయాణాన్ని మొదటి నుంచి చూస్తున్నాను. నాలాగే విశ్వక్ కూడా సినిమా సినిమాకు, పాత్ర పాత్రకూ కొత్తదనం చూపించడానికి ట్రై చేస్తాడు. అతడిది కూడా ఉడుకు రక్తం. నాలాగే దూకుడుతనం కూడా విశ్వక్‌లో ఉంది. నాగవంశీ, విశ్వక్ సేన్ కలయికలో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది' అన్నారు.
ఈ సినిమా హిట్ అవుతుంది
బాలయ్య కొనసాగిస్తూ.. 'మనం ఎప్పుడూ కొత్తదనం ఇవ్వాలని చూస్తాం. అది నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. మనం కొత్తదనం ఇస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఈ సినిమాలో ఆ కొత్తదనం కనిపిస్తుంది. అన్నం ఉడికిందా? లేదా? అని మెతుకు పట్టుకుని చరూస్తే చాలు. అలానే ఈ ట్రైలర్ చూస్తేనే సినిమా బాగుందని అర్థం అవుతుంది' అని పేర్కొన్నారు.

మోక్షజ్ఞ ఆ ముగ్గురే ఆదర్శం
చివర్లో బాలయ్య మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. 'నా తనయుడు మోక్షజ్ఞ కూడా సినీ రంగంలోకి వస్తాడు. వాడికి నన్ను చూసి ఏం నేర్చుకోవద్దు అనే చెప్తాను. ఈ తరం హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్ వంటి వాళ్ళని చూసి నేర్చుకోమని చెప్తాను. వాడి వెనుక నేను కూడా ఉంటాను అనుకోండి అది వేరే విషయం' అని చెప్పుకొచ్చారాయన.


Click it and Unblock the Notifications











