బాలకృష్ణ హీరోగా సుప్రసిద్ధ దర్శకుడు వైవియస్ దర్శకుడు వైవియస్ చౌదరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఒక్క మగాడు చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకులముందుకు వచ్చింది. సినిమా విడుదలై రెండోరోజుకు చేరింది కానీ తొలి రోజు అభిమానుల రాష్ట్రవ్యాప్తంగా చేసిన హంగామా మాత్రం వార్తల్లో నిలిచింది. సినిమా ఎలా ఉందనే సంగతి పక్కన పెడితే బాలకృష్ణ అభిమానుల హంగామా మాత్రం హల్ చల్ సృష్టించింది. ఒక్క మగాడు సినిమాతోనే తన రాజకీయ జీవితానికి బాలకృష్ణ నాంది పలకాలనుకొన్నాడని, అందుకే సినిమా విజయవంతం కావాలని బాలకృష్ణ తిరుపతికి వెళ్లి వెంకన్నను కూడా సందర్శించుకున్నాడు. బాలకృష్ణ హడావుడికి తగ్గట్టుగానే అభిమానులు కూడా సినిమా విడుదల రోజు ర్యాలీలు, ఉత్సవాలతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలను ముంచెత్తారు. ఈ ప్రాంతంలో సంక్రాంతి రెండు రోజులమందే వచ్చిందా అన్నట్టుగా బాలకృష్ణ అభిమానుల సంబరాలు మిన్నంటాయి. ఇంతవరకు బాగానే ఉన్నా సినిమా మాత్రం కేవలం అభిమానులకే పరిమితం అన్నట్టుగా సమీక్షలు వచ్చాయి. మరి ఈ వారం గడిస్తేకానీ ఒక్కమగాడు సినిమా సత్తా ఏంటో తెలియదు.