షాట్ పూర్తయిన తర్వాత బాలకృష్ణ సెలైన్ ఎక్కించుకుని...
హైదరాబాద్ :"కొన్ని సన్నివేశాల్లో బాలయ్యగారు నటించేటప్పుడు తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయలేదు. షాట్ పూర్తయిన తర్వాత ఆయన సెలైన్ ఎక్కించుకుని వెంటనే స్పాట్‌కు వచ్చిన తీరు చూస్తే కన్నీళ్ళు ఆగలేదు. అంత అంకిత భావంతో పనిచేశారాయన'' అని 'శ్రీమన్నారాయణ' ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాజా రవీంద్ర తెలిపారు. బాలకృష్ణ హీరోగా నటించిన 'శ్రీమన్నారాయణ' ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రమేష్ పుప్పాల నిర్మాత. ఇషాచావ్లా, పార్వతిమెల్టన్ నాయికలు. రవిచావలి దర్శకుడు. ఈ చిత్రం విజయోత్సవ వేడుకలో ఇలా రాజా రవీంద్ర స్పందించారు.
బాలకృష్ణ మాట్లాడుతూ.."శ్రీమన్నారాయణలో నేను చేసిన జర్నలిస్ట్ పాత్రకు చాలా మంచి స్పందన వచ్చింది. రవికుమార్ చావలి అద్భుతంగా తీర్చిదిద్దారు. జర్నలిస్ట్ అంటే సమాజానికి సేవ చేసే వ్యక్తి. ఇంతవరకు నేను చేయని పాత్ర ఇది. చాలా వైవిధ్యంగా ఉంది. ఇలాంటి విభిన్నమైన పాత్రల్లో నటించేటప్పుడు నేను ఏ విషయాన్నీ ఆలోచించట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అభిమానులుండగా నాకేంటి భయం? వాళ్ళు ఇలాంటి సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నంత కాలం పలు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూనే ఉంటాను. చక్రి సంగీతం అనగానే సినిమా సగం హిట్టనుకున్నా. సినిమాను ప్రేమించే నిర్మాత రమేష్ పుప్పాల. యూనిట్ సమష్టి కృషి ఈ చిత్ర విజయం'' అని నందమూరి బాలకృష్ణ అన్నారు.
నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ "మా సినిమా మొదలైనప్పటి నుంచి మా హీరోగారు అందించిన సహకారం మరువలేనిది. ఆయన మద్దతుతోనే అనుకున్న సమయంలో పూర్తి చేశాం. ఈ సినిమాకు పనిచేసిన వారందరూ తమ సొంత సినిమా అనుకుని చేశారు. అందరికీ ధన్యవాదాలు'' అని చెప్పారు.
"నేనడిగినవన్నీ ఇచ్చారు నిర్మాత. క్వాలిటీ కోసం ఎంతో కృషి చేశాం. బాలయ్య సినిమాకు బాణీలు అనగానే రెట్టింపు ఉత్సాహంతో పనిచేశాను'' అని చక్రి తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ "సినిమా కొత్తగా రావడానికి బాలయ్య ఎంతగానో సహకరించారు. ఆయన అందించిన ప్రోత్సాహం మరువలేనిది. ఈ సినిమాకు చక్రి బాణీలతో పాటు, ఆర్.ఆర్.ను కూడా చక్కగా అందించారు'' అని అన్నారు.


Click it and Unblock the Notifications











