బాలకృష్ణపై మరో వివాదం.. పవన్ కల్యాణ్ ఎపిసోడ్ లో బూతులు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్!
సీనియర్ ఎన్టీఆర్ తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో తెరంగేట్రం చేసిన తనదైన నటనతో, డైలాగ్ డెలివరీతో, డ్యాన్స్ లతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు బాలకృష్ణకు స్టార్ డమ్ తీసుకొచ్చాయి. తాజాగా వీర సింహా రెడ్డి సినిమాతో మంచి హిట్ కొట్టిన బాలయ్య బాబు ఇటీవల తరచుగా వివాదాల పాలవుతున్నారు. వీర సింహా రెడ్డి సక్సెస్ మీట్ లో అక్కినేని నాగేశ్వర రావును అవమానించేలా మాట్లాడారని అటు అక్కినేని ఫ్యామిలీతో పాటు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు బాలకృష్ణ. ఆయన చేసిన వ్యాఖ్యలపై బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

దేవ బ్రహ్మణల మనోభావాలపై..
నందమూరి నటసింహం బాలయ్య బాబు ఇటీవల వివాదాల పాలవుతున్నారు. ఇటీవల వీర సింహా రెడ్డి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో దేవ బ్రహ్మణల మనోభావాలను దెబ్బ తీసేలా బాలయ్య వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆ సంఘం వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో బాలకృష్ణ స్పందిస్తూ బహిరంగా లేఖ ద్వారా క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.
తర్వాత వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన విధానం హాట్ టాపిక్ గా మారింది. వీర సింహా రెడ్డి సినిమా గురించి చెబుతూ తోటి ఆర్టిస్టులతో కూడా మాట్లాడే విధానంపై కూడా ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు.

అక్కినేని తొక్కినేని అంటూ..
ఈ క్రమంలో "మా ఆర్టిస్టులు అంత నాకు మంచి టైమ్ పాస్ , వేదాలు శాస్త్రాలు నాన్నగారి డైలాగ్ లు, సినిమాలు.. ఆ రంగారావు ఈ అక్కినేని తొక్కినేని ఇవన్నీ కూర్చొని మాట్లాడుకునేవాళ్లం" అని నందమూరి బాలకృష్ణ ఊహించని విధంగా మాట్లాడారు. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇలా అక్కినేని తొక్కినేని అనే మాట మాట్లాడడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అక్కినేని వారసులు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ కూడా సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణ అన్న వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఏదో ఫ్లోలో వచ్చిందని చెప్పి..
తొక్కినేని అనడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో బాలయ్య బాబు స్పందించారు. హిందూపురం ప్రచారంలో "ఎన్టీ రామారావును ఎన్టీవోడు అంటారు.. నాగేశ్వరరావును నాగీగాడు అంటారు.. ఒక్కొక్క రాష్ట్రం.. ఒక్కొక్క యాస.. అభిమానంతో అలా అంటారు. అప్పుడు ఏదో ఫ్లోలో వచ్చింది. నాగేశ్వరరావు నాకు ఎప్పుడూ బాబాయే. నేనంటే ఆయనకు ఎప్పుడూ ఇష్టమే" అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. దీంతో కాస్తా ఆ వివాదం సద్దుమణిగినట్లు అయింది.

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్...
అయితే ఇప్పుడు బాలకృష్ణపై మరో వివాదం రాజుకుంది. బాలకృష్ణ హోస్ట్ గా అదరగొడుతున్న టాక్ షో అన్ స్టాపబుల్. ఈ షో రెండో సీజన్ ముగింపు ఎపిసోడ్ ను పవన్ కల్యాణ్ తో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ మొదటి పార్టును ఫిబ్రవరి 2న రాత్రి 9 గంటలకు విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ లో పవన్ కల్యాణ్ మూడు పెళ్లిల్లు, రాజకీయం, పవర్ స్టార్ గా మారడం వంటి ఆసక్తిర విషయాలతోపాటు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై కూడా చర్చించారు.

నర్సు భలే అందంగా ఉంది..
సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై చర్చించిన తర్వాత కాలేజ్ డేస్ లో తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పుకొచ్చారు బాలకృష్ణ. "కాలేజీ రోజుల్లో బైక్ లు వేసుకుని బాగా తిరిగేవాళ్లం. నాకు కూడా ఓరోజు యాక్సిడెంట్ అయింది. నిజాం కాలేజ్ దాటి వెళుతున్నాను. అటువైపు నుంచి ఒక బైక్ వచ్చి కొట్టేసింది. దీంతో ఎక్కడో ఎగిరిపడ్డాను. తర్వాత కళ్లు తెరిస్తే ఆస్పత్రిలో ఉన్నాను. మొత్తం రక్తం. ఆ నర్సు దానమ్మ భలే అందంగా ఉంది. అదేమో క్లీన్ చేస్తుంది" అని బాలకృష్ణ మాట్లాడారు.

క్షమాపణలు చెప్పకుంటే..
ఇప్పుడు బాలయ్య మాట్లాడిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ పేర్కొన్నారు. బాలకృష్ణ తన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, నర్సులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలా క్షమాపణలు చెప్పకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మరి ఈ వివాదంపై బాలయ్య బాబు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇలా వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ.


Click it and Unblock the Notifications











