నందమూరి నాలుగో తరం హీరో ఎంట్రీ.. బాలయ్య, ఎన్టీఆర్, కల్యాణ్ దూరం ఎందుకంటే!
తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి వంశానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. టాలీవుడ్‌లో ఆ కుటుంబానికి ఎన్టీఆర్ పునాది వేసి మహా వృక్షంలా విస్తరింప చేశారు. ఆయన దారిలో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, స్వర్గీయ తారకరత్న లాంటి హీరోలు తమ అభిమానులను ఆకట్టుకొన్నారు. అయితే తాజాగా ప్రతిష్టాత్మకమైన కుటుంబం నుంచి నాలుగో తరం వారసుడు ఎంట్రీ ఘనంగా సాగింది. ఆ కుటుంబం నుంచి వచ్చిన నందమూరి తారక రామారావు తెరంగేట్రం మే 12వ తేదీన సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖుల మధ్య జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
నందమూరి హరికృష్ణ మనవడు, నందమూరి జానకిరామ్ కుమారుడు తారక రామారావును హీరోగా తెలుగు తెరకు పరిచయం చేసే ప్రయత్నాన్ని ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరీ భుజానికెత్తుకొన్నాడు. ఈ సినిమా ముహుర్తం, ఫస్ట్ షాట్ చిత్రీకరణకు ముందే తారక రామారావు ఎంట్రీ గురించి మీడియా సమావేశాలు నిర్వహించి భారీ ఎలివేషన్ ఇచ్చారు. అయితే తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు స్వర్గీయ ఎన్టీఆర్ ఘాట్‌లో అట్టహాసంగా జరిగాయి.

న్యూ టాలెంట్స్ రోర్స్ (NTR) బ్యానర్‌పై వైవీఎస్ చౌదరీ సతీమణి యలమంచిలి గీత నిర్మాతగా తారక రామారావును పరిచయం చేస్తూ ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తెలు నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, లోకేశ్వరి తదితరులు చేతుల మీదగా ఈ వేడుక విజయవంతంగా కొనసాగింది. అత్యంత ఆహ్లాదకరంగా సాగిన వేడుకలో హరికృష్ణ సతీమణి, జానకిరామ్ సతీమణితోపాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
హీరో తారక రామారావు మాట్లాడుతూ.. స్వర్గీయ ఎన్టీఆర్, హరికృష్ణ, జానకీరామ్ ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. దివి నుంచి ఈ కార్యక్రమాన్ని చూస్తూ సంతోషిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. నేను వేయబోయే మొదటి అడుగుకు నా తాతలు, అమ్మమ్మలు, బాబాయిలు ఎంకరేజ్‌మెంట్ ఉండటం ఆనందంగా ఉంది. ఈ పూజా కార్యక్రమానికి వచ్చిన నాన్నమ్మకు, ముహుర్తం షాట్‌కు దర్శకత్వం వహించిన లోకేశ్వరి, కెమెరా స్విచ్చాన్ చేసిన పురందేశ్వరి, క్లాప్ కొట్టిన నారా భువనేశ్వరి గార్లకు ధన్యవాదాలు. ఈ ముహుర్తం షాట్‌కు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించిన తాత నందమూరి మోహనకృష్ణ, స్క్రిప్టు అందించిన అత్తమ్మ సుహాసిని థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను అని అన్నాు.
ఎన్టీఆర్ ఘాట్ అంటే పుణ్య స్థలం, శక్తిని ఇచ్చే ప్రదేశంగా భావిస్తాను. నందమూరి అభిమానులు కష్టాలు, సుఖాలు పంచుకొనే ఈ ప్రదేశంలో ఆయన నాలుగో తరానికి చెందిన ఆయన పేరుతో ఆయన మనవడి సినిమా ఈ కార్యక్రమం జరగడం ఉద్వేగభరితమైంది. అలాంటి పేరుతో వస్తున్న కుర్రాడు కళారంగంలో రాణిస్తాడని భావిస్తున్నాను అని దర్శకుడు వైవీఎస్ చౌదరీ అన్నాడు.

అయితే ప్రతిష్టాత్మకంగా జరిగిన ముహుర్తం షాట్ వేడుకకు నందమూరి అగ్రహీరోలు బాలకృష్ణ, కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్..అలాగే లోకేష్, చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వర్లు దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్ లండన్ పర్యటనలో ఉండటం, బాలకృష్ణ ముందస్తు కార్యక్రమాల్లో బిజీగా ఉండటం.. అలాగే చంద్రబాబు, లోకేష్ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందించారు.


Click it and Unblock the Notifications











