బాలకృష్ణ కొత్త కథ కూడా అలాంటిదే
హైదరాబాద్: బాలకృష్ణ హీరోగా సత్యదేవా దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాలయ్య గత చిత్రాల తరహాలో ఉండబోతోంది. ఈ చిత్రం గురించి దర్శకుడు సత్యదేవా మాట్లాడుతూ... అన్యాయం జరిగినప్పుడు, పేదవాడి ఆక్రందన విన్నప్పుడు, నీతికి చెదలు పడుతున్నప్పుడు భగవంతుడొస్తాడో రాడో తెలీదుగానీ ఓ నాయకుడు మాత్రం వస్తాడు. చీడ పురుగుల పీడ నుంచి వ్యవస్థను, తనని నమ్ముకొన్నవాళ్లను కాపాడతాడు. అలాంటి వ్యక్తి కథే మా చిత్రం అంటున్నారు సత్యదేవా. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది.
నిర్మాత మాట్లాడుతూ... ''బాలకృష్ణ పాత్ర చిత్రణ, ఆయన సంభాషణలు చిత్రానికి ప్రాణం. ప్రతి సన్నివేశం అందరికీ నచ్చేలా ఉంటుంది''అని చెప్పారు. ఈ చిత్రానికి మణిశర్మ బాణీలు సమకూరుస్తున్నారు. త్రిష హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి రుద్రపాటి రమణారావు నిర్మాత. రామ్‌లక్ష్మణ్ నేతృత్వంలో బాలకృష్ణ తదితరులపై పోరాట సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.

గతంలో మణిశర్మ,బాలకృష్ణ కాంబినేషన్ లో నరసింహనాయుడు, సమరసింహా రెడ్డి, లక్ష్మీ నరసింహా వంటి చిత్రాలు వచ్చి మ్యూజికల్ గానూ విజయవంతమయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ తో ఈ చిత్రం రెడీ అవుతోందని సమాచారం. ''బాలకృష్ణ శైలికి తగ్గ కథ ఇది. కుటుంబ అనుబంధాలతోపాటు అభిమానుల్ని అలరించే అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి. సాంకేతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ భారీ వ్యయంతో రూపొందించబోతున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే తెలియజేస్తాము''అని నిర్మాతలు తెలిపారు.
మరోవైపు సెంచరీ చిత్రానికి బాలయ్య దగ్గరపడుతున్నారు. ఆ చిత్రం ప్రత్యేకంగా ఉండాలన్నది ఆయన అభిమతం. వీలైతే... బోయపాటి శ్రీను ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే... అభిమానులకు ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చినట్టే.


Click it and Unblock the Notifications











