Unstoppable with NBK: బాలకృష్ణ సెన్సేషనల్ రికార్డు.. తెలుగులో నెంబర్ వన్.. ఇండియాలో ఐదో ర్యాంక్
ఆరు పదుల వయసులోనూ ఏజ్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా యమ ఉత్సాహంగా కనిపిస్తుంటారు నటసింహా నందమూరి బాలకృష్ణ. కుర్రాళ్లకు ధీటుగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న ఆయన.. ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈ సీనియర్ హీరో.. ఇప్పుడు హోస్టుగానూ పరిచయం అయ్యారు. తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఆయన Unstoppable with NBK Show అనే షోను చేస్తున్నారు. మొదటిసారే అయినా ఎవరూ ఊహించని రీతిలో అలరించిన బాలయ్య.. షోను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నటసింహం ఓ సెన్సేషనల్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆ వివరాలు మీకోసం!

అఖండతో ట్రాక్ ఎక్కేసిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే ‘అఖండ'. ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్ ఇందులో హీరోయిన్. శ్రీకాంత్ ఈ చిత్రంలో విలన్‌గా నటించాడు. థమన్ దీనికి సంగీతం అందించాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాతో బాలయ్య సక్సెస్ ట్రాక్ ఎక్కారు.

హోస్టుగా పరిచయమైన స్టార్ హీరో
ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే నందమూరి బాలకృష్ణ.. అరవై ఏళ్ల ఏజ్‌లోనూ సాహసాలకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ‘Unstoppable with NBK' అనే టాక్ షోతో ఓటీటీలోకి హోస్టుగా వచ్చారు. ఆహా సంస్థ దీన్ని రూపొందించింది. దీపావళి పండుగను పురస్కరించుకుని నవంబర్ నెలలో ఈ టాక్ షోను అంగరంగ వైభవంగా మొదలెట్టారు.

ఫిదా చేసిన బాలయ్య.. సూపర్ హిట్
నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న బాలకృష్ణ ఏ షోనూ హోస్ట్ చేయలేదు. కానీ, ‘Unstoppable with NBK' షోకు మాత్రం ఆయన అదిరిపోయే హోస్టింగ్ చేస్తున్నారు. తొలి ప్రయత్నమే అయినా వచ్చిన గెస్టులతో పాటు ప్రేక్షకులను అలరిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకూ వచ్చిన ఏడు ఎపిసోడ్స్ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో షో కూడా విజయవంతం అయింది.

ఏడు ఎపిసోడ్స్.. గెస్టులు ఎవరంటే
నటసింహా హోస్ట్ చేస్తున్న ‘Unstoppable with NBK' షో నుంచి ఇప్పటి వరకూ ఏడు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అయ్యాయి. మొదటి దాంట్లో మోహన్ బాబు ఫ్యామిలీ, రెండో దానిలో హీరో నాని, మూడో ఎపిసోడ్‌లో బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, నాలుగో దానిలో అఖండ యూనిట్, ఐదో దానికి రాజమౌళి, కీరవాణి, ఆరో దానికి పుష్ప టీమ్, ఏడో దానికి రవితేజ, గోపీచంద్ మలినేని వచ్చారు.

లాస్ట్ మూడు ఎపిసోడ్ గెస్టులు వీళ్లే
ఇప్పటికే ఏడు ఎపిసోడ్స్‌ను పూర్తి చేసుకున్న ‘Unstoppable with NBK' షో.. మరో మూడింటిని మాత్రమే స్ట్రీమింగ్ చేయబోతుంది. ఇందులో ఎనిమిదో ఎపిసోడ్‌కు దగ్గుబాటి రానా గెస్టుగా వచ్చాడు. తొమ్మిదో ఎపిసోడ్‌కు విజయ్ దేవరకొండతో పాటు పూరీ జగన్నాథ్ వచ్చారు. ఇక, చివరి ఎపిసోడ్‌కు సూపర్ స్టార్ మహేశ్ బాబు వచ్చాడు. వీటన్నింటి షూటింగ్స్ పూర్తి అయ్యాయి.

షోతో బాలకృష్ణ సెన్సేషనల్ రికార్డు
సుదీర్ఘమైన కెరీర్‌లో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన ఏకైక షో ‘Unstoppable with NBK'. సినీ ప్రముఖులతో ముచ్చట్లు పెట్టే ఈ కార్యక్రమం సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా ఇది అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆహా సంస్థ అధికారికంగా వెల్లడించింది. దీంతో నందమూరి హీరో ఖాతాలో మరో ఘనత వచ్చి చేరినట్లు అయింది.
Recommended Video

తెలుగులో 1.. ఇండియాలో 5 ర్యాంక్
వినోద రంగానికి సంబంధించి రేటింగ్‌లు, ర్యాంకులు ఇచ్చే IMDB సంస్థ తాజాగా ఇండియాలోని టాప్ 10 టాక్ షోల లిస్టును విడుదల చేసింది. ఇందులో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘Unstoppable with NBK' షోకు 9.2 రేటింగ్ వచ్చింది. దీంతో ఇది తెలుగులో నెంబర్ వన్ షోగా నిలిచింది. అలాగే, ఇండియా వ్యాప్తంగా ఈ షోకు ఐదో ర్యాంక్ సొంతం అయింది.


Click it and Unblock the Notifications











