అద్దె ఇల్లు వేటలో బాలకృష్ణ
హైదరాబాద్: ఇదేంటి సొంత ఇల్లు ఉన్న బాలకృష్ణకి అద్దె ఇంటిని వెతకటమేంటనే డౌట్ వస్తోందా... హిందూపురం నుంచి బరిలో నిలిచిన నందమూరి బాలకృష్ణ స్థానిక పాండురంగ నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రచార కార్యాక్రమాలను చేపట్టేందుకు, పర్యవేక్షించేందుకు ఇల్లు అవసరమని ఆయన భావించారు.
దీంతో అనువైన ఇంటిని వెతికే పనిలో అనుచరులు నిమగ్నమయ్యారు. రాయదుర్గం నుంచి పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థి కాలువ శ్రీనివాసులు స్థానిక తిప్పేస్వామి లేఅవుట్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అక్కడి నుంచే తన ఎన్నికల కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి సైతం పెనుకొండలోని బీటీఆర్ కాలనీలో ఓ ఇల్లు తీసుకున్నారు.

మరో ప్రక్క బాలకృష్ణకు ప్రచారంలో తన అభిమానుల నుంచి మంచి ఆదరణ దొరుకుతోంది. తమ వూరు వచ్చిన అభిమాన నేతకు ఆత్మీయంగా బహుమతులిస్తూ, తమ ఆప్యాయతకు గుర్తుగా తోచిన రీతిలో జ్ఞాపికలను అందిస్తూ ఆనందిస్తున్నారు. ఆయన సినీ హీరో కూడా కావడంతో తన చిత్రాల్లో విలన్ పై ఉపయోగించిన ఆయుధాలనే ప్రజానీకం ఆయనకు బహూకరిస్తున్నారు. బాలయ్య సైతం వారి అభిమానంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సమరసింహారెడ్డి, సింహా, లెజెండ్ తదితర చిత్రాల్లో బాలయ్య నటనకు వినియోగించిన ఆయుధాలు వైవిధ్యంగా ఉండటం తెలిసిందే. వాటి నకళ్లను తయారు చేయించిన అభిమానులు ఇప్పుడు బాలయ్యకు ప్రచారంలో బహూకరిస్తున్నారు. వివిధ ఆకృతుల్లో ఉన్న కత్తులను, గొడ్డళ్లను అందిస్తూ ఆకట్టుకుంటున్నారు. కొందరైతే బాలయ్య తాజా చిత్రం 'లెజెండ్'లోని ఆయన వేషధారణను అనుకరిస్తూ సందడి చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











