తెలుగుదేశం నేతలను కొట్టిన బాలయ్య
తనను కలవడానికి వచ్చిన తెలుగుదేశం నేతలపై నటుడు బాలకృష్ణ చేయిచేసుకోవంటం అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ సంఘటన ఆయన అభిమానులను నిరుత్సాహపరచింది. బాలయ్య చేతి దెబ్బ రుచి చూసిన నేతలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తాను హీరోగా నటించిన సింహా చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా బాలకృష్ణ గురువారం జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకునేందుకు శ్రీకాళహస్తికి విచ్చేశారు. బాలయ్యను చూడడానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. వీరితోపాటు స్థానిక టీడీపీ నేతలు సైతం దక్షిణ గోపురం సుపథ మండపం వద్ద స్వాగతం పలికారు.
అక్కడినుంచి అభిమానుల కేరింతల మధ్య బాలయ్య ముక్కంటి దర్శనం కోసం బయలుదేరారు. ప్రధానద్వారమైన కంచుగడప ద్వారా లోనికి ప్రవేశిస్తుండగా జనంమధ్యలో ఓ టీడీపీ నేత బాలకృష్ణకు అడ్డుతగిలారు. దీంతో ఆగ్రహించిన బాలయ్య ఆయనపై చేయి చేసుకున్నారు. అనంతరం కంచుగడప దాటుకుని వినాయకుని గుడి వద్దకు వెళ్తుండగా మరో నేత పార్టీ కండువా వేయడానికి ప్రయత్నించారు. ఇది బాలయ్యకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. సహనం కోల్పోయిన ఆయన ఆ నాయకుని చెంప చెళ్లుమనిపించారు. దాంతో ఆ నాయకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. నిజానికి శ్రీకాళహస్తికి బాలకృష్ణ పర్యటన ఖరారైనప్పటి నుంచి ఆయనే ఏర్పాట్లు చేయటం విశేషం.


Click it and Unblock the Notifications











