రవితేజ ‘బలుపు’ మొదలైంది
హైదరాబాద్ : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న 'బలుపు' చిత్రం ప్రారంభమైంది. పివిపి సినిమా బేనర్ పై గతంలో రవితేజతో వీడింతే చిత్రం రూపొందించిన ప్రసాద్ వి.పొట్లూరి 'బలుపు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈచిత్రం ప్రారంభోత్సవం గురువారం ప్రొడక్షన్ హౌస్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి రవితేజ, వివి వినాయక్, హరీష్ శంకర్, బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, ఎడిటర్ గౌతం రాజు, కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
వీర సినిమా దగ్గర నుంచి రవితేజ సినిమాలన్నీప్లాపులే. దీంతో రవితేజ సినిమాలంటే ప్రేక్షకుల్లో క్రేజ్ కూడా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో తన కెరీర్ ప్రమాదంలో పడిపోతుందనే విషయం గ్రహించిన రవితేజ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. త్వరలో రవితేజ తన 'బలుపు' చూపించడానికి రెడీ అవుతున్నాడు.
ఇంతకు ముందు రవితేజతో గోపీచంద్ మలినేని 'డాన్‌శీను' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈచిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ స్క్రిప్టు రచయితగా పని చేస్తున్నారు. 'దూకుడు' సినిమాతో పాటు పలు చిత్రాలకు అదిరిపోయే స్క్రిప్టు అందించిన కోన వెంకట్ ఈ చిత్రానికి ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్ తో కూడిన స్క్రిప్టు అందించబోతున్నాడు. ఈ సారి రవితేజకు హిట్టు ఖాయమనే ధీమా ఆ చిత్ర వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా సెలక్ట్ అయింది. సంగీత దర్శకడు తమన్ ఈ చిత్రానికి సూపర్ హిట్ ఆడియో అందించేందుకు కృషి చేస్తున్నాడు. ఈ చిత్రంలో రవితేజ క్యారెక్టర్ కామెడీని పండిస్తూ యాక్షన్ సీన్లతో అదరగొట్టేదిగా ఉంటే... శృతి హాసన్ క్యారెక్టర్ రవితేజకు తగిన జోడీగా ఎంటర్ టైన్మెంట్ పంచుతూ అందాల ఆరబోతతో గ్లామరస్‌గా ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











