త్రివిక్రమ్ 'ఆడియో' నా వాయిస్ కాదు.. కొట్టి పారేసిన బండ్ల గణేష్.. స్పందించనంటూనే!
బండ్ల గణేష్ అనే పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో ఒక ప్రొడక్షన్ మేనేజెర్ గా కెరీర్ మెదలు పెట్టి, నటుడిగానే కాకుండా బడా నిర్మాతగా ఎదిగారు. అత్యంత తక్కువ సమయంలో సక్సెస్‌ఫుల్ నిర్మాత, బిజినెస్‌మ్యాన్‌గా గుర్తింపు సంపాదించుకున్న బండ్ల, అంతేకాక వివాదాస్పద వ్యక్తిగా కూడా పేరు తెచ్చుకున్నారు . బండ్ల గణేష్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఉన్న అభిమానం ఇప్పుడు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. త్రివిక్రమ్ ను దుర్భాషలు ఆడుతున్నట్టుగా ఉన్న ఫోన్ కాల్ రికార్డులు వైరల్ అయ్యాయి. తాజాగా ఆ ఆడియో మీద బండ్ల గణేష్ స్పందించారు. ఆ వివరాలు

హాట్ టాపిక్ గా
తనను తాను పవన్‌కు భక్తుడిగా చెప్పుకునే బండ్ల.. మైక్ దొరికితే చాలు పవన్‌పై ఉన్న అభిమానాన్ని కవితల రూపంలో చెబుతూ ఉంటారు. గతంలో పలు పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్స్‌లో పవన్ కళ్యాణ్‌పై ఆయన కురిపించిన ప్రశంసలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే బండ్ల గణేష్ మాట్లాడినట్లు ఉన్న ఓ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నన్ను రాకుండా
ఈ ఆడియో క్లిప్‌లో బండ్ల అభిమాని మాట్లాడుతూ.. ‘అన్న భీమ్లానాయక్ ప్రిరిలీజ్ ఈవెంట్‌కు వెళ్తున్నావా.? స్పీచ్ ప్రిపేర్ చేసుకున్నావా.? ఈసారి చింపేయాలి' అంటూ కోరగా దానికి బండ్ల స్పందిస్తూ.. ‘త్రివిక్రమ్ నన్ను రావొద్దు అన్నాడంటా. అదే ఆలోచిస్తున్నాను. నాకు వెళ్లాలని ఉంది, కానీ పిలవలేదు. త్రివిక్రమ్ ప్లాన్ చేసుకొని నన్ను రాకుండా చేస్తున్నాడు. ఆడిటోరియం మొత్తం బండ్లన్న అని అరవండి, నేను పక్కనే ఉంటా, వెంటనే స్టేజ్ మీదికి వస్తాను' అని చెప్పుకొచ్చాడు.

నేను స్పందించను
అయితే ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఆడియోలో మాట్లాడింది నిజంగా బండ్ల గణేషేనా.? లేదా ఎవరైనా మిమిక్రీ లాంటిది ఏదైనా చేశారా.? అనే విషయం మీద కూడా చర్చ జరుగుతోంది. ఈ ఆడియో క్లిప్‌పై బండ్ల గణేష్ నుంచి వివరణ కోసం ఒక టీవీ చానల్ ప్రయత్నించింది. అయితే ఈ విషయమై గణేష్ స్పందిస్తూ.. నెట్టింట వైరల్ అవుతోన్న ఆడియో తనది కాదని కొట్టి పారేశారు. ఈ విషయంపై నేను స్పందించను అంటూ ఆయన పేర్కొన్నారు.

ముఖ్య అతిథులుగా
పవన్ కళ్యాణ్ హీరోగా భీమ్లానాయక్ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌ను సోమవారం నిర్వహించాలని చిత్రయూనిట్ భావించింది. అయితే ఆంధ్రప్రదేశ్ మంత్రి గౌతం రెడ్డి అకాల మరణంతో చిత్ర యూనిట్ వేడుకను బుధవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక సోమవారం నిర్వహించాల్సిన ఈవెంట్ లో తెలంగాణా మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ముఖ్య అతిథులుగా హాజరు కావాల్సి ఉంది.
Recommended Video

ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్
సినిమా ప్రమోషన్ లో భాగంగా మూవీ ట్రైలర్ ని సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు రిలీజ్ చేశారు మేకర్స్.. ట్రైలర్ సినిమా పై అంచనాలు భారీగా పెంచేసింది. పవన్ కల్యాణ్, రానా మధ్య సాగే పవర్‌ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి . తమన్ మ్యూజిక్‌తో పాటు పవన్ కల్యాణ్, రానా యాక్టింగ్ సూపర్బ్ అనిపించాయి. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాని షేక్ చేసి టాలీవుడ్ లో వేగంగా 100K లైక్స్ అందుకున్న ట్రైలర్ గా రికార్డు నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











