పవన్ కల్యాణ్‌కు అది ఎక్కువ, కానీ.. బండ్ల గణేష్ మరోసారి సెన్సేషనల్ కామెంట్
రాజకీయాల్లోకి వచ్చి తక్కువ రోజుల్లోనే హల్ చల్ చేసిన బండ్ల గణేష్ రాజకీయాలు నాకొద్దు బాబోయ్ అంటూ రాజకీయాల నుండి వైదొలిగారు. ఇక ఇప్పుడు జనసేనపై బండ్ల గాలి మళ్లినట్టుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన కోరిక అని, ఏదో ఒకరోజు తప్పక ఆ కోరిక తీరుతుందని సినీ నిర్మాత, హాస్య నటుడు బండ్ల గణేష్ అన్నారు.

పవన్ పై బండ్ల పొగడ్తల వర్షం
సినీ నిర్మాత బండ్ల గణేష్ రాజకీయాలనుండి వైదొలిగిన తర్వాత మళ్లీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాట పాడుతున్నారు. పవన్ కళ్యాణ్ స్వచ్ఛమైన వ్యక్తి అంటూ కితాబిస్తున్నారు. అంతే కాదు ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ భగవంతుడు తయారుచేసిన అరుదైన వ్యక్తి అంటూ ఓ రేంజిలో పవన్ ను పైకెత్తిన బండ్ల గణేష్ ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు.

పవన్ ముఖ్యమంత్రి అయితే అది ఏపీ ప్రజల అదృష్టం అన్న బండ్ల
పవన్ కళ్యాణ్ కు ఉన్న ఆవేశం రాష్ట్ర ప్రజల మంచి కోసమేనని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే అది ఏపీ ప్రజల అదృష్టమని బండ్ల గణేష్ తెలిపారు. ముఖ్యమంత్రికి కావలసిన అన్ని అర్హతలు పవన్ కళ్యాణ్ కు ఉన్నాయని, పవన్ కు తనకు మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని పేర్కొన్నారు. శరీరాలు వేరైనా తమ మనసులు ఒకటేనని చెప్పుకున్నారు. రాజకీయాలు చేస్తానని ఢిల్లీ వెళ్లి మరీ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుని అభాసు పాలైన ఆయన తాజాగా జనసేనాని పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని గతంలో బండ్ల హడావిడి
గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి హడావిడి చేసిన బండ్ల గణేష్ తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే సెవన్ ఓ క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకుంటా అని సంచలనం సృష్టించిన బండ్ల గణేష్ ఆ తరువాత రాజకీయ పరిణామాలతో రాజకీయాలు తన ఒంటికి సరిపడవని బయటకు వెళ్లిపోయారు.

పవన్ కు వీర భక్తుడు .. కాంగ్రెస్ మాజీ నేత బండ్ల గణేష్
పవన్ కళ్యాణ్ కు పరమ భక్తుడిని అని చెప్పుకునే బండ్ల గణేష్ గత ఎన్నికల సమయంలో ఊహించని విధంగా కాంగ్రెస్ లో చేరి బోలెడు సంచలనాలతో రాష్ట్రం దృష్టిని ఆకర్షించాడు. కానీ రాజకీయాల్లో ఉన్నది , ఉంచుకున్నదీ పోయిందని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇది టెంపరరీగా కాదు.. పాలిటిక్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేశాను అంతేనని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.

డబ్బులు మిగులుతాయని అనుకుంటే
మంచి సినిమా.. కాస్త మనకు డబ్బులు మిగులుతాయని అనుకుంటే తీస్తానని చెప్పారు. డబ్బులు మిగలకుండా సినిమా తీయాలంటే తనకు భయమని చెప్పిన ఆయన రాజకీయాలకు గుడ్ బై అన్నారు. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి ఓ రేంజ్ లో పొగడ్తలు గుప్పిస్తున్న బండ్ల గణేష్ ఏదో ఒక రోజు పవన్ సీఎం అవుతారని జోస్యం చెప్పి మరోమారు వార్తల్లో నిలిచారు.


Click it and Unblock the Notifications











