Bandla Ganesh పవన్ కల్యాణ్ ఫ్యాన్ కాబట్టే ఏపీకి మంత్రి అయ్యావు.. మినిస్టర్ అనిల్ కుమార్‌కు బండ్ల గణేష్ పంచ్
దేశవ్యాప్తంగా టికెట్ల రేట్లు పెంపు విషయం ఒకేలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో అతితక్కువగా సినిమా టికెట్ రేట్లు ఉండటంపై వివాదం, విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్, నేచురల్ స్టార్ నానితోపాటు కొందరు హీరోలు బహిరంగంగాగే అసంతృప్తిని వ్యక్తం చేస్తే.. చాలా మంది సినీ ప్రముఖులు పరోక్షంగా స్పందిస్తున్నారు.
అయితే ఇటీవల శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో సినీ హీరో నాని చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపాయి. అయితే అసలు నాని ఎవరు అంటూ ఏపీ మంత్రి అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై నటుడు, నిర్యాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. అయితే బండ్ల గణేష్ ఎందుకు రియాక్ట్ అయ్యారంటే..

ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదం
ఏపీలో సినిమా టికెట్ రేట్లు అతి తక్కువగా ఉండటంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. బాల్కని ధర 30, మిగితా కేటగిరిలో 20, 10 రూపాయలు ఉండటంపై ఛాయ్ కంటే సినిమా టికెట్ తక్కువ, సినిమా టికెట్ కంటే బైక్ పార్కింగ్ రేటు ఎక్కువ. ఇలా టికెట్ రేట్లు ఉంటే.. సినీ పరిశ్రమ మనుగడ ఎలా అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నాని కాస్త ఘాటుగానే స్పందిచడం వివాదాస్పదమైంది.

టికెట్ రేట్లపై సినీ హీరో నాని
శ్యామ్ సింగరాయ్ మీడియా సమావేశంలో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఏపీలో సినిమా టికెట్ రేట్లు తగ్గించడం ప్రేక్షకులను అవమానించినట్టే.. సినిమా థియేటర్ కౌంటర్‌లో వచ్చే ఆదాయం.. పక్కనే ఉన్న కిరాణం కొట్టు కౌంటర్ వచ్చే ఆదాయం కంటే చాలా తక్కువ. నేను ఇలా మాట్లాడితే వివాదం కావోచ్చు. కానీ ఎవరు ఏమనుకొన్నా.. నా మనసులో మాట చెప్పాలనిపించింది అని నాని కామెంట్ చేశారు.

నాని ఎవరు.. కొడాలి నాని మాత్రమే తెలుసు
ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నాని చేసిన వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్ లాంటి మంత్రులు ఘాటుగా స్పందించారు. ఇటీవల మంత్రి అనిల్ కుమార్ స్పందిస్తూ.. నాని ఎవరు? నాకు కొడాలి నాని మాత్రమే తెలుసు. టికెట్ రేట్లు తగ్గిస్తే తమ పారితోషికం తగ్గిపోతుందనే బాధలో సినీ హీరోలు ఉన్నారు. 50 కోట్ల రెమ్యునరేషన్ 30 కోట్లకు పడిపోతుందనే టెన్షన్‌తో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. అంతే తప్ప ప్రేక్షకుల మీద జాలి, ప్రేమతో కాదు అనే విధంగా అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు.

నేను పవర్ స్టార్ అభిమానిని..
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంతటితో ఆగకుండా ఒకప్పుడు నేను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానిని. ఆయన సనిమా రిలీజ్ అయితే నా బైక్ అమ్మేసి వచ్చిన మొత్తంతో కటౌట్లు కట్టాను. ప్రస్తుతం పవన్ కల్యాణ్ అభిమానులందరి పరిస్థితి అంతే అని ఏపీ మంత్రి తన గురించి చెప్పుకొన్నారు. సినిమా ప్రొడక్షన్ వ్యయం కంటే హీరోల పారితోషికం ఎక్కువ అవుతుందని మంత్రి అనిల్ కుమార్ విమర్శించారు.

బండ్ల గణేష్ పంచ్ ట్వీట్ వైరల్
అయితే పవన్ కల్యాణ్ సినిమా కోసం బైక్ అమ్మానని మంత్రి అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై బండ్ల గణేష్ తనదైన శైలిలో స్పందించారు. పవన్ కల్యాణ్ అభిమానివి కాబట్టే నీవు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మంత్రివి అయ్యావ్ అన్నా అంటూ కామెంట్ చేశారు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు భారీగా స్పందించారు. 1600కుపైగా రీట్వీట్లు, సుమారు 6 వేల లైక్స్ పడ్డాయి. అయితే బండ్ల గణేష్ చేసిన ట్వీట్ సినీ, రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారుతున్నది. బండ్ల గణేష్ భలే పంచ్ వేశాడే అంటూ కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











