హీరోలందరి కంటే పవన్‌కల్యాణ్ ఇష్టమని తేల్చి చెప్పాడు
సింహాచలం : పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకమైన అనుబంధం ఉన్న బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ చిత్రంతో వరస ప్లాపుల్లో ఉన్న పవన్ కి ఊరట ఇచ్చి మరింత దగ్గరయ్యారు. తాజాగా ఇదే విషయం మీడియా వద్ద ప్రస్తావించారు. పవన్ కల్యాణ్‌తో మరో సూపర్‌హిట్ చిత్రం నిర్మించనున్నట్లు చెప్పారు. తనకు ప్రస్తుతం ఉన్న హీరోలందరి కంటే పవన్‌కల్యాణ్ అంటే ఇష్టమని ఆయన తెలిపారు. శనివారం ఆయన సతీసమేతంగా సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇక అప్పన్న స్వామి అంటే తనకెంతో నమ్మకమని, గబ్బర్‌సింగ్ చిత్రం విడుదలకు ముందు స్వామిని దర్శించుకున్నానన్నారు. ప్రస్తుతం హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో నిర్మించిన బాద్‌షా చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానున్నట్లు చెప్పారు. ఈ సినిమాలో దర్శకుడు శ్రీను వైట్ల మార్కు కచ్చితంగా కనిపిస్తుందని, అంతేగాకుండా ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందన్నారు. చిత్రంలో హాస్యంతో పాటు వినోదం ఉందన్నారు. బాద్‌షా చిత్రం ఈ వేసవిలో ప్రేక్షకులకు వినోదం పంచుతుందని బండ్ల గణేశ్ అన్నారు.
ఐటీ దాడుల విషయం ప్రస్తావించగా సినిమా పరిశ్రమలో ఇవన్నీ సహజమేనన్నారు. తన వరస సినిమాలు గురించి చెప్తూ.. అల్లు అర్జున్ హీరోగా నిర్మిస్తున్న ఇద్దరమ్మాయిలతో చిత్రం పూర్తయిందని, త్వరలోనే హీరో మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌లతో సినిమాలు తీయనున్నట్లు ఆయన చెప్పారు. ఫలానా హీరోతోనే సినిమా తీయాలనే తాను ఎప్పుడూ కోరుకోనని, అందరు హీరోలతోను సినిమాలు తీస్తానన్నారు. అయితే పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేక అభిమానమని, తనకు లైఫ్ ఇచ్చిన హీరో ఆయనని తెలిపారు.
ఇటీవల బండ్ల గణేష్ ఇంటిపై ఐటీ దాడులు జరగడం పట్ల విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆ దాడులు సాధారణమని బదులిచ్చారు. అనంతరం ఆయన ఆలయంలో కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన చేశారు. స్వామి ప్రసాదాన్ని స్వీకరించారు. చిరంజీవి సేవా సమితి జిల్లా కోకన్వీనర్ లంక సూరిబాబు, క్రాంతి పిక్చర్స్ ప్రతినిధి ఎం.వి.వి. రామకృష్ణ ఆయన వెంట ఉన్నారు.


Click it and Unblock the Notifications











