'బంగారు లక్ష్మణ్' ఉదంతంపై సినిమా.. డిటేల్స్
అప్పట్లో సంచలనం సృష్టించిన కేసు బీజేపీ నాయకుడు బంగారు లక్ష్మణ్ ది అందరికీ గుర్తుండే ఉంటుంది. ఢిఫెన్స్ డీల్‌లో ఆయుధ డీలర్లుగా చెప్పుకుని మారు రూపాల్లో వెళ్లిన జర్నలిస్టుల నుంచి బంగారు లక్ష్మణ్ లంచం తీసుకున్న కేసు అప్పట్లో పెద్ద దుమారమే లేపింది. తెహెల్కా వెబ్‌సైట్ జర్నలిస్టులు ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇప్పుడా వివరాలతో ఓ చిత్రం తెరక్కబోతోంది.పాత్రికేయం నుంచి సినిమా నిర్మాతగా మారిన కుమార్ బాదల్ ఈ మేరకు సంకల్పించారు. 'వేలంటైన్స్ నైట్' పేరిట తొలి చిత్రాన్ని నిర్మించిన ఆయన తన రెండో చిత్రాన్ని ప్రముఖ నటులతో నిర్మించాలని ఉవ్విళ్లూరుతున్నారు.
తెహల్కా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ తరువాత ఎదుర్కొన్న పరిస్థితులపై నిర్మించే ఈ చిత్రంలో పాత్రికేయుని పాత్ర ను రణవీర్‌కపూర్, షాహిద్ కపూర్ లేదా రణవీర్‌సింగ్ ధరిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. "ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో తెహల్కా పాత్రికేయ బృందం ఒకటి.. బీజేపీ నాయకుడు బంగారు లక్ష్మణ్, తదితరులపై నిర్వహించిన 'ఆపరేషన్ వెస్ట్ ఎండ్' తరువాత ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా ఈ చిత్రం నిర్మిస్తాం'' అని కుమార్ వివరించారు. రాజకీయాల్లో అవినీతిని 'స్టింగ్ ఆపరేషన్' ద్వారా వెలుగులోకి తెచ్చి సంచలనం సృష్టించిన ఈ 'తెహల్కా'ఇతివృత్తం వెండితెరపై సంచలనం సృష్టిస్తుందని భావిస్తున్నారు. తెహెల్కా స్టింగ్ ఆపరేషన్ సిడిలను 2001 మే 13వ తేదీన విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











