ఆస్కార్ కి ‘ఈగ’వెనక్కితోసి ఇలియానా సినిమా ఎంపిక
హైదరాబాద్ : ఇలియానా నటించిన తొలి హిందీ సినిమా 'బర్ఫీ'. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల బరిలోకి భారతదేశం తరఫున చిత్రం దిగబోతోంది. 2012 సంవత్సరానికిగానూ 'బర్ఫీ' చిత్రాన్ని ఎంపిక చేసినట్టు శనివారం రాత్రి ప్రకటించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్ జ్యూరీ ఛైర్‌పర్సన్ మంజు బోరా ఈ విషయం తెలియచేసారు. ఆస్కార్ అవార్డ్స్ విభాగంలో 'ఉత్తమ విదేశీ చిత్రం' విభాగానికి సంబంధించిన నామినేషన్ కోసం మన భారతదేశం నుంచి ఒక సినిమాని ఎంపిక చేసింది ఎఫ్‌ఎఫ్‌ఐ. వివిధ భారత భాషల్లో రూపొందిన దాదాపు 20 చిత్రాలను వీక్షించారు.
మంజు బోరా మాట్లాడుతూ ''మొత్తం 20 ఎంట్రీలు వచ్చాయి. వాటిలో 'బర్ఫీ' చిత్రాన్ని ఎంపిక చేశాం. మానవ సంబంధాలకు ప్రాధాన్యమున్న చిత్రమిది. మన దేశం స్థితిగతుల్ని కూడా ప్రతిబింబించేలా తెరకెక్కించారు. అందుకే ఈ సినిమాని ఎంపిక చేశాము. మేం చూసిన అన్ని చిత్రాలు బాగున్నాయి. కానీ అకాడమీ అవార్డ్స్ కమిటీ నిబంధనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆ మేరకు 'బర్ఫీ'ని ఎంపిక చేశాం. ఆస్కార్ నామినేషన్‌కు పంపించడానికి సినిమా కథ, నాణ్యత ముఖ్యం. 'బర్ఫీ'లో ఇవి మెండుగా ఉన్నాయి. మానవీయ విలువలను అద్భుతంగా చూపించిన చిత్రం ఇది'' అన్నారు.
ఎప్పుడూ కూడా హిందీ సినిమాలకే అవకాశాలిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి కదా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ''సినిమాలో ఉన్న విషయం, విలువల్నిబట్టే ఎంపిక జరుగుతుంది. అంతే కానీ భాషతో సం బంధమేమీ లేదు'' అన్నారు. మన సినిమాలు ఆస్కార్‌లో చివరి వరకూ నిలవలేకపోతున్నాయి కదా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ''సినిమాని ఎంపిక చేయడం వరకే మా బాధ్యత. అక్కడ ఆస్కార్ వేదికపైకి చేరడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తే బాగుంటుంద''న్నారు. ఈ కార్యక్రమంలో జ్యూరీ సభ్యులు పాల్గొన్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ ఆ జ్యూరీలో ఉన్నారు. తెలుగు నుంచి రాజమౌళి ఈగ చిత్రం కూడా పోటీకి వెళ్లింది. అయితే 'బర్ఫీ' నే ఎంపిక చేసారు.


Click it and Unblock the Notifications











