'బెండు అప్పారావు' షూటింగ్ పూర్తి
సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రామానాయుడు నిర్మిస్తున్న 'బెండు అప్పారావు ఆర్.ఎం.పి.' చిత్రం షెడ్యూల్ పూర్తయింది. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నరేష్ హీరోగా నటిస్తున్నారు. చిత్రం ప్రోగ్రెస్ ను రామానాయుడు వివరిస్తూ 'ఈ షెడ్యూల్ షూటింగ్ కోనసీమలో జరిగింది. ఇ.వి.వి. స్వస్థలం కోరుమామిడితో పాటు దోసకాయలపల్లి, దొమ్మేరు, తోగుమ్మి, గూటాల, రాజమండ్రి, ధవళేశ్వరం తదితర లొకేషన్లలో చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొనగా ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించాం. దర్శకుడు ఇ.వి.వి., హీరో నరేష్, ఇతర యూనిట్ సభ్యులు సినిమా బాగా రావడంకోసం ఎంతో కృషి చేస్తున్నారు. వినోదభరితంగా చిత్రం రూపుదిద్దుకుంటోంది. అందుకు తగిన ఆర్టిస్టులు దొరకడం ప్లస్ పాయింట్. జూలైలో మరో షెడ్యూల్‌ని కూడా కోనసీమలోనే చిత్రీకరిస్తాం' అన్నారు. దర్శకుడు ఇ.వి.వి. మాట్లాడుతూ 'నాయుడుగారికి సూపర్‌హిట్ చిత్రం తీసి ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆద్యంతం ప్రేక్షకులను నవ్వించే స్క్రిప్ట్ దొరికింది. షూటింగ్ చేస్తున్నప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూశాక ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం కలుగుతోంది' అన్నారు. కామ్నా జెఠ్మలాని, మేఘన హీరోయిన్లుగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











