బెట్టింగ్ యాప్ స్కామ్‌లో విజయ్ దేవరకొండ, రానా, నిధి అగర్వాల్.. ఇంకా 18 మందిపై కేసు
తెలుగు సినిమా పరిశ్రమను ప్రస్తుతం బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ స్కామ్ కుదిపేస్తున్నది. ఈ కేసులో సినీ ప్రముఖులు, టెలివిజన్ యాంకర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఉండటంతో సంచలనంగా మారింది. గత రెండు రోజుల క్రితం ప్రారంభమైన కేసుల నమోదు.. రోజు రోజుకు ఊపందుకొంటున్నది. ఈ కుంభకోణంలో మొత్తంగా 18 మందిపై కేసులు నమోదు చేశారు. వారిలో ఎవరెవరు ఉన్నారనే వివరాల్లోకి వెళితే..
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది యువకులు, పలు కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు బయటకు రావడంతో సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సోషల్ యాక్టివిస్టులు ఫిర్యాదు చేయడంతో పంజాగుట్ట, మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.

బెట్టింగ్ యాప్ కేసు విచారణను వేగవంతం చేసిన పంజాగుట్ట పోలీసులు.. విష్ణుప్రియ, టేస్టీ తేజతోపాటు మరో ఆరుగురికి నోటీసులు జారీ చేశారు. వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల, సుప్రిత, రీతూ చౌదరీ, అజయ్, సన్నీ సుధీర్, అజయ్ సన్నీలకు నోటీసులు జారీ చేశారు. గురువారం వారిని విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే విష్ణుప్రియ గురువారం రోజున పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. బుధవారం టేస్టీ తేజ విచారణకు హాజరై తన వాదనను వినిపించినట్టు తెలిసింది.
ఇదిలా ఉండగా, తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కూడా కేసులు నమోదు చేశారు. సామాజిక కార్యకర్తలు చేసిన ఫిర్యాదు మేరకు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, ప్రణీత, మంచు లక్ష్మీ, నిధి అగర్వాల్, అనన్య నాగళ్లతోపాటు 18 మందిపై కేసులు నమోదు చేసి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.
మియాపూర్ పోలీసులు కేవలం సినిమా తారలే కాకుండా టెలివిజన్ యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కూడా కేసు పెట్టారు. వారిలో యాంకర్ శ్రీముఖి, సిరి హన్మంతు, వర్షిణి, వాసంతి, కార్తీకదీపం ఫేమ్ శోభాశెట్టి, అమృత, పావని, నేహా, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, సన్నీయాదవ్, రఘు తదితరులు ఉన్నారు.
ఇదిలా ఉండగా, బెట్టింగ్ యాప్ స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కూడా దృష్టిపెట్టారు. పంజాగుట్ట, మియాపూర్ పోలీసుల నుంచి వివరాలు సేకరించారు. అలాగే సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ నుంచి డేటా స్వీకరించారు. నిషేధిత ఈ యాప్‌ల ద్వారా భారీగా డబ్బు నకిలీ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ అయిందా? అనే విషయంపై అధికారులు దృష్టిపెట్టారు.


Click it and Unblock the Notifications











