»   » కాదు కాదు... తెలుగు సినిమా పుట్టినరోజు నేడే!

కాదు కాదు... తెలుగు సినిమా పుట్టినరోజు నేడే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో తొలి టాకీ మూవీ విడుదలై నేటితో 84 సంవత్సరాలు పూర్తి చేసుకుని 85వ వసంతంలోకి అడుగు పెడుతోంది. హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో తయారైన తొలి తెలుగు టాకీ 1932 ఫిబ్రవరి 6న విడుదలైంది. అయితే తెలుగు సినిమా పుట్టినరోజు గురించి కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి.

భారతీయ తొలి టాకీ 'ఆలంఆరా' విడుదలైన ఆరు నెలల తర్వాత అంటే 1931 సెప్టెంబర్ 15న 'భక్త ప్రహ్లాద' చిత్రం విడులైందని కొందరు వాదిస్తున్నప్పటికీ....అది వాస్తవం కాదనీ, 1932 జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 6న తొలి తెలుగు టాకీ సినిమా విడుదలైందని తర్వాత ఆధారాలతో సహా తేల్చారు పాత్రికేయులు రెంటాల జయదేవ. జయదేవ పరిశోధనలో వెల్లడైన వివరాల ప్రకారం ఈ సినిమా చెన్నయ్‌లో విడుదల కావడానికి మరో రెండు నెలలు పట్టింది. కాగా 'భక్తప్రహ్లాద' 1932 ఫిబ్రవరి 6న విడుదలైందనే విషయాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పటికీ అంగీకరించక పోవడం గమనార్హం.

Bhakta Prahlada is the first Telugu full length talkie film

ఆ వివాదం సంగతి పక్కన పెట్టి ‘భక్త ప్రహ్లాద' సినిమా వివరాల్లోకి వెళితే...హిందీలో తొలి టాకీ ‘ఆలం ఆరా' అర్దేషిర్‌ ఇరానీ తీశాడు. ఆయనకి తెలుగులోనూ, తమిళంలోనూ కూడా చిత్రాలు తియ్యాలనిపించింది. హెచ్‌.ఎమ్‌.రెడ్డి తెలుగువాడు గనక తెలుగు ‘భక్తప్రహ్లాద'ని , తమిళ 'కాళిదాసు'ని ఆయనకు అప్పజెప్పారు. అప్పట్లో ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన "భక్త ప్రహ్లాద" నాటకాన్ని సురభి నాటక సమాజం వారు వేస్తుండేవారు. ఆ నాటక సమాజం వారిని బొంబాయి పిలిపించి, వారితో చర్చించి, సినిమా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని బొంబాయిలోని కృష్ణామూవీటోన్ స్టూడియోలో తీశారు. అప్పుడు ఈ చిత్ర నిర్మాణ వ్యయం 20 వేల రూపాయలు మాత్రమే.

భక్త ప్రహ్లాద సినిమాలో హిరణ్యకశిపునిగా మునిపల్లె సుబ్బయ్య, హిరణ్యకశిపుని భార్య లీలావతిగా సురభి కమలాబాయి నటించారు. సినిమాలో ప్రధానపాత్ర అయిన ప్రహ్లాదుని పాత్రను కృష్ణాజిరావు సింధే ధరించారు. ఇంద్రునిగా దొరస్వామినాయుడు, బ్రహ్మగానూ, చండామార్కుల్లో ఒకనిగానూ చిత్రపు నరసింహారావు నటించారు. ప్రహ్లాదుని సహాధ్యాయి అయిన ఓ మొద్దబ్బాయిగా తర్వాతికాలంలో దర్శకునిగా మారిన ఎల్.వి.ప్రసాద్ నటించారు. ఎల్.వి.ప్రసాద్ మొట్టమొదటి తమిళ టాకీ కాళిదాసులో కూడా నటించారు.

కాగా...టాకీల ఆవిర్భావంతో సినిమా ఎవరూ ఊహించనంత మార్పులకు లోనయింది. ఆంగ్లో ఇండియన్లు, 'మూకీ మహారాజులు'గా వెలుగొందిన ఎంతోమంది టాకీల రాకతో క్రమేపీ తమ ప్రాభవాన్నీ, ప్రతిష్టనూ కోల్పోయారు. అప్పటివరకూ భాషాబేధాలు లేకుండా అందరినీ సమానంగా అలరించిన సినిమా ప్రేక్షకుల మధ్య కొత్త గోడల్ని ఏర్పరచింది. దీని ప్రభావం వల్ల ఎవరికి వారు తమ భాషలోనే చలనచిత్రాలు ఉండాలన్న కోరికను వ్యక్తం చేయసాగారు.

English summary
Bhakta Prahlada is the first Telugu full length talkie film, based on The Story of Narasimha and Prahlada made by H. M. Reddy, a pioneer of the Indian film industry. It is a talkie about a devotee Prahlada in Hindu mythology.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu