బాబోయ్ ..'వరుడు' మాత్రం అసలు వద్దు...భానుశ్రీ మెహ్రా
అల్లు అర్జున్ 'వరుడు' లో హీరోయిన్ గా చేసిన భానుశ్రీ మెహ్రా తనకు నిజజీవితంలో ఎలాంటి వరుడు కావాలో చెబుతూ..."ఆ సినిమాలోని వరుడు లాంటివాడు అస్సలు వద్దు. ఒకరినొకరు చూసుకోకుండా పెళ్లేంటి! నలుగుర్ని చూడాలి. ఒకర్ని ఎంచుకోవాలి" అంటోంది. మంగళవారం హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది. అలాగే "వరుడు సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాను. కానీ నేను వూహించిన స్థాయి సంతృప్తి దక్కలేదు" అని చెప్పుకొచ్చింది. దానికి కారణం చెబుతూ.."వరుడు సినిమా ఒప్పుకునే ముందు కథ క్లుప్తంగా మాత్రమే చెప్పారు. అంగీకరించిన తరవాత పూర్తి కథ చెప్పారు. బన్నీతో నటిస్తున్నంతసేపూ ఫన్నీగా గడిచింది. ఒక హీరోలా కాకుండా, ఒక స్నేహితుడిలా మెలిగారు. 'చెంచల' అంటూ సరదాగా పిలిచేవారు. చాలా మంచోడు. దర్శకుడు గుణశేఖర్ లోని క్రమశిక్షణ నాకెంతో నేర్పింది. హీరోయిన్ ను చివరి వరకూ దాచి పెట్టడం అనే ప్రచారసూత్రం మూలంగా నేను పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు చేరువ కాలేకపోయాను" అంది. ఇక రాబోయే చిత్రాల్లో పాత్ర పరిధి మేరకే అందాలు ఆరబోస్తాననీ, బికినీ ధరించననీ భానుశ్రీ తెలిపారు. ప్రస్తుతం కొత్త చిత్రాలకు సంబంధించిన చర్చలు సాగుతున్నాయని తెలిపింది.


Click it and Unblock the Notifications











