బలుపు వైసీపీ ఎమ్మెల్యేలదా? సినిమా వాళ్లదా? వైఎస్ జగన్‌ను ఎందుకు కలవాలి? ప్రసన్నకుమార్ రెడ్డిపై తమ్మారెడ్డి
తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖులు బలిసిన వాళ్లు అంటూ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమారం రేపుతున్నాయి. సినీ పరిశ్రమను టార్గెట్ చేయడంపై నటులు, దర్శకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పేదల కోసం టికెట్ రేట్లు తగ్గించామని చెబుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు.. నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు తగ్గించడం లేదు అంటూ సినీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టెలివిజన్ ఛానెల్ చర్చలో దర్శక, నిర్మాత, నటుడు తమ్మారెడ్డి భరద్వాజ ఘాగా స్పందిస్తూ..

వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో పేదలు ఈ రోజు సినిమాకు వెళ్లి మూవీ చూడాలంటే 1000 రూపాయలకు పైనే టికెట్ ధర ఉంది. ఏనాడైనా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడిగాడా? గతంలో ముఖ్యమంత్రిగా చేశావు. ఏపీ విభజన తర్వాత ఐదేళ్లు పాలించావు. ఏనాడైనా సినిమా టికెట్ల రేట్లు తగ్గించావా? ఆ సమయంలో సినిమా హీరోలకు, పరిశ్రమకు సపోర్ట్ చేశాడు. వాళ్లను బలిసే విధంగా చేశావే తప్ప.. ఏనాడైనా వాళ్లను ప్రశ్నించావా? సినిమా పరిశ్రమలో నీవాళ్లు, నీ కులం వాళ్లు ఉన్నారు కాబట్టి వాళ్లను సపోర్ట్ చేస్తున్నావు. పేదల కోసం టికెట్ రేట్లు వైఎస్ జగన్ తగ్గిస్తే.. మాఫియాను అణిచివేస్తావని వ్యాఖ్యలు చేస్తావా అంటూ చంద్రబాబుపై ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

మిగితా ధరలను తగ్గించరేంటి?
ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై తమ్మారెడ్డి మాట్లాడుతూ.. పేదల కోసం టికెట్ రేట్లు తగ్గించామని ఆయన చెప్పారు. అది కరెక్టే అనుకొందాం. కానీ మిగితా ధరల విషయం గురించి మాట్లాడరేం అని తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించాడు. ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఎవరైనా సినీ ప్రముఖులు కలిశారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కలవాలి.. వారికి ఎందుకు ఇంత అక్కసు అని ప్రశ్నించారు.

ఆంధ్రాలో షూటింగుల విషయం తెలియదా?
ఏపీలో ఏ ప్రభుత్వం ఉందనే విషయం పట్టించుకోకుండా ఆంధ్రాలో సినిమా షూటింగులు జరుగుతుంటాయి. ఈ విషయం ఏపీలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు తెలియవు. వైజాగ్ రామానాయుడు స్టూడియోలో ఎప్పుడు ఒడియా, బెంగాలీ సినిమా షూటింగులు జరుగుతుంటాయి. ఇలాంటి విషయాలు ప్రభుత్వంలోని పెద్దలకు తెలియవు అని తమ్మారెడ్డి భరద్వాజా అన్నారు.

ఎమ్మెల్యేలు బలిసారా? సినిమా తారలు బలిశారా?
సినిమా పరిశ్రమలో బలిసిన వాళ్లు ఎవరున్నారో చూపించాలి. ఎమ్మెల్యేలు బలిసారా? లేక ఒక్క ఎమ్మెల్యేకి ఉన్న ఆస్తుల విలువ సినిమా పరిశ్రమలో ఎవరికైనా ఉందా చూపించాలి. అప్పుడే ఎమ్మెల్యేలు బలిసారా? లేక సినిమా వాళ్లు బలిసారా అనే విషయం తేటతెల్లం అవుతుంది. నోరుంది కదా అని బలుపు అంటూ బూతులు మాట్లాడటం సరికాదు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.

అసెంబ్లీని బూతులతో భ్రష్టు పట్టించారంటూ
ఏపీలో రాజకీయ నేతల ప్రవర్తన, మాటలు సరిగా లేవు. అసెంబ్లీని బూతులతో భ్రష్టుపట్టించారు? ఇక సినిమా పరిశ్రమను కూడా అలాంటి బూతులతో నాశనం చేస్తారా? అసెంబ్లీ మాటల్లో చెప్పలేని బూతులు వినిపిస్తున్నాయి. ప్రజా ప్రయోజానాలకు ఉపయోగించాల్సిన సభ సమయాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గంటకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అని తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు.
Recommended Video

బస్సు ఛార్జీలను ఎందుకు పెంచారు?
పేదల కోసం టికెట్ రేట్లు తగ్గించామని చెబుతున్న వైసీపీ నేతలు.. ఏపీలో పండుగకు ఊరెళ్లి రావడం పేద ప్రజలకు కష్టంగా మారింది. ప్రైవేట్ బస్సులను రద్దు చేసి.. ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచారు. పండుగ పేరుతో టికెట్ రేట్లు భారీగా పెంచారు. 1000 రూపాయలు ఉన్న టికెట్ 3500 రూపాయాలు చేశారు. పేద ప్రజల కోసం టికెట్ ధరను 600 రూపాయలకు చేయవచ్చు కదా.. ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలకు సరియైన విధానాలు తెలియవు అంటూ తమ్మారెడ్డి ధ్వజమెత్తారు.


Click it and Unblock the Notifications











