అలా అయితే.. కమ్మ కులం వారిని కాల్చి చంపండి.. వైసీపీ నేతల తీరుపై తమ్మారెడ్డి భరద్వాజ్ ఫైర్
ఏపీలో సినిమా టికెట్ రేట్లు వివాదం మరింత ముదిరే విధంగా కనిపిస్తున్నది. సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నానితో రాంగోపాల్ వర్మ భేటి తర్వాత టెలివిజన్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ క్రమంలో ఏపీలో అధికార పార్టీకి చెందిన నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తాజాగా చంద్రబాబు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలను తమ్మారెడ్డి భరద్వాజతోపాటు పలువురు సినీ ప్రముఖులు తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..

సినిమా హీరోలు కోట్లు సంపాదించుకొని
సినిమా పరిశ్రమపై ప్రసన్న కుమార్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యలు చేస్తూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సినిమా వాళ్ల పొట్టన కొడుతున్నారట. పేదవాళ్ల కోసం సినిమా టికెట్ రేట్లను తగ్గించాం. ఈ రోజు సినిమా హీరోలు కోట్లు సంపాదించుకొని బ్రహ్మండంగా ఉన్నారు. విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. అదే పేదవాళ్లు సినిమా చూద్దామని థియేటర్‌కు వెళితే 100, 1000, 2000 ధరను పెడుతున్నారు. పెద్ద హీరోల సినిమా టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్నారు. చంద్రబాబు తన సామాజిక వర్గానికి మేలు చేసే విధంగా వ్యహరించారు అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను సినిమా పరిశ్రమ తీవ్రంగా భావిస్తున్నది.

కమ్మ కులాన్ని టార్గెట్ ఎందుకు
ఏపీలో కమ్మ కులాన్ని టార్గెట్ చేయడం ఎందుకు? తెలుగు రాష్ట్రాల్లో కేవలం 8 శాతం నుంచి 10 శాతం వరకు ఉంటారేమో. వాళ్లు నచ్చకపోతే మీరు వాళ్లను కాల్చిచంపండి. ఇక మీకు పీడ విరుగుడు అవుతుంది. లక్షల మంది కమ్మలు కాల్చివేస్తే దరిద్రం వదిలిపోతుందేమో అని తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రంగా స్పందించారు.

ఎమ్మెల్యేలకు అంత డబ్బు ఎక్కడిది?
వ్యాపారం చేస్తే డబ్బులు, ఆదాయం వస్తాయి.. కానీ ప్రజాసేవలో ఉండే ఎమ్మెల్యేలకు పరిమితికి మించిన ఆదాయం ఎక్కడి నుంచి వస్తున్నది. ఎమ్మెల్యేలు, మంత్రులు సేవకులైతే వారికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నది? జనాల సొమ్ము తినే వారు లెక్కకు మించి డబ్బు ఎలా సంపాదిస్తున్నారు. కేవలం వైసీపీ వాళ్లే కాదు.. దేశంలోని రాజకీయ నేతలందరిది ఇదే తీరు అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

ఆ ఎమ్మెల్యే కమ్మపార్టీలో లేడా?
ప్రసన్నకుమార్ రెడ్డి కులాన్ని టార్గెట్ చేయడంపై సరికాదు. గత కొద్ది సంవత్సరాల వరకు ప్రసన్నకుమార్ రెడ్డి కమ్మ పార్టీలో లేరా? ఆయన తండ్రి కమ్మల పార్టీలో ఉండలేదా? ఇప్పుడే కులం ప్రస్తావన ఎందుకు? ఇప్పుడు కమ్మ కులంపై విరుచుకపడటం ఎందుకు అని తమ్మారెడ్డి ప్రశ్నించారు.
Recommended Video

నిత్యావసర వస్తువల ధరలు తగ్గించరేంటి?
ఏపీలో సినిమా టికెట్ రేట్లపైనే ఎందుకు పట్టింపు? నిత్యావసర వస్తువుల ధరలు, పండుగ సమయంలో పేదలకు మేలు జరిగే బస్సు టికెట్ రేట్లు ఎందుకు తగ్గించరు? సినిమా టికెట్ రేటును 10, 20 రూపాయలు తగ్గించి.. మిగితా రేట్లు పెంచడం సరైనదా? అని తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు. అంతేకాకుండా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పు అంటూ తమ్మారెడ్డి భరద్వాజ ఖండించారు.


Click it and Unblock the Notifications











