చంపేస్తామని అంజలి పిన్నికి బెదిరింపులు
హైదరాబాద్ : హీరోయిన్ అంజలి వ్యవహారం ఇప్పుడిప్పుడే కుదుట పడుతుందనుకుంటున్న తరుణంలో ఆమె పన్ని భారతీదేవికి బెదింపు కాల్స్ రావడం చర్చనీయాంశం అయింది. తనకు కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, ఇల్లు, ఆస్తులు వదిలేసి చెన్నై వదిలి వెళ్లి పోవాలని, లేకుంటే చంపేస్తామని అంటున్నారని భారతీదేవి మీడియాతో చెప్పుకొచ్చారు.
కొన్ని రోజుల క్రితం తనకు ఇలాంటి ఫోన్లే రాగా...ఫోన్ స్విచాఫ్ చేసి పెట్టానని, ఇప్పుడు వారు తన భర్త, కుమారుడికి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. వారు తమిళంలో మాట్లాడుతున్నారని, ఎవరికీ దొరకుండా శాటిలైట్ ఫోన్ ద్వారా వారు ఫోన్లు చేస్తున్నారనే అనుమానం వ్యక్తం చేసారు భారతీ దేవి. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి రక్షణ కల్పించాల్సిందిగా కోరినట్లు తెలిపారు.
అంజలి వ్యవహారంలోకి వెళితే...ఇంటర్మీడియట్ అయిన తర్వాత పిన్ని భారతీదేవితో కలిసి ఉంటూ హీరోయిన్‌గా ఎదిగిన అంజలికి ఈ మధ్య పిన్నితో విబేధాలు వచ్చాయి. పిన్ని డబ్బు కోసం వేధిస్తోందని మీడియా ప్రకటన చేసి, వెంటనే ప్రాణభయం ఉందంటూ అజ్ఞాతంలోకి వెళ్లి అందరినీ హైరానా పెట్టిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం పిన్ని భారతీదేవితో దూరంగా తన అసలు పేరెంట్స్ వద్దుకు చేరిన అంజలి తను కమిటైన సినిమాల షూటింగుల్లో బిజిగా గడుపుతోంది. తనకు డేట్స్ ఇచ్చి సినిమా షూటింగుకు రాని అంజలిపై తమిళ దర్శకుడు కళంజియం ఆమెపై కేసు వేసాడు. కళంజియంతో సినిమా చేయనని చెప్పడం వల్లనే అంజలికి ఆమె పిన్నికి మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతనే అంజలి తన పిన్ని భారతీదేవిపై, కళంజియంపై తీవ్ర ఆరోపణలు చేసింది. తనను డబ్బుకోసం వేధిస్తున్నారని, ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆరోపణలు చేసింది.


Click it and Unblock the Notifications











