షాకింగ్ డెసిషన్.. రజనీ, కమల్, అజిత్, విజయ్‌లకు ఎదురుదెబ్బ
తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో సంస్కరణలు తరచూ కనిపిస్తూ ఉంటాయి. అక్కడి దర్శకులు, నిర్మాతలు కలిసికట్టుగా ఉంటూ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇప్పటికే ఈ సంఘాలు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాయి. తాజాగా కోలీవుడ్‌లో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇండస్ట్రీలోని పద్నాలుగు మంది స్టార్ హీరోల సినిమాలపై ఎఫెక్ట్ పడనుంది.
తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న రజనీ, కమల్, విజయ్, అజిత్, సూర్యా, కార్తీ, శివకార్తికేయన్, విశాల్, ధనుష్, శింబు, విజయ్‌సేతుపతి, జయం రవి, రాఘవ లారెన్స్, విక్రమ్‌లు నటించిన చిత్రాలు విడుదల చేసేందుకు నిర్మాతల సంఘం కొత్త ఆంక్షలు విధించింది. ఈ మేరకు నిర్మాతల సంఘం సలహా కమిటీ అత్యవసర సర్క్యులర్‌ను జారీ చేసింది. రాష్ట్ర సినీ నిర్మాతల సంఘం, సేలం ఏరియా పంపిణీదారుల మండలి సంయుక్త సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంది.

కొత్త సినిమాల విడుదల సమయంలో ఏర్పడే ఆటంకాలు, ఇబ్బందులను పరిష్కరించడానికి చేపట్టాల్సిన చర్యలు గురించి, చిత్రాల విడుదలలో ఏర్పడే ఇబ్బందుల కారణంగా వాటిల్లే నష్టాలను సరిచేయడం గురించి సమగ్రంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు. బడా హీరోల చిత్రాలు, భారీ బడ్జెట్‌తో తయారయ్యే చిత్రాలను సేలం ఏరియాలో 45 డిజిటల్ ప్రింట్లతోనే విడుదల చేయాలని తీర్మానించారు. ఇతర నటీనటుల చిత్రాలకు సంబంధించి 35 డిజిటల్ ప్రింట్లు మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించారు.
చిన్న బడ్జెట్ చిత్రాలను నిర్మాతల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సేలం డిస్ట్రిబ్యూటర్ల సంఘం బాధ్యత వహించి మూడు శాతం సర్వీసు ఛార్జిని మాత్రమే తీసుకుని రిలీజ్ చేయడానికి సహకరించాలని తీర్మానించారు. ఈ నిర్ణయాలు మంగళవారం నుంచే అమలులోకి వస్తాయని నిర్మాతల సంఘం ఆ సర్క్యులర్‌లో ప్రకటించింది. దీంతో బడా హీరోల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











