తిరుమలలో లారెన్స్‌కు చేదు అనుభవం
హైదరాబాద్: దర్శకుడు, నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్‌కు ఈ రోజు తిరుమలలో చేదు అనుభవం ఎదురైంది. తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించడంతో మీడియా ముందుకు వచ్చి సిబ్బంది తీరుపై తన ఆగ్రహాన్ని వెల్లగక్కారు లారెన్స్.
లారెన్స్ మీడియాతో మాట్లాడుతూ... తాను దర్శనం చేసుకుంటుండగా దేవస్థాన సిబ్బంది తన పట్ల అనుచితంగా, అమర్యాదగా ప్రవర్తించారని, తనను బలవంతంగా బయటకు నెట్టేసారని లారెన్స్ చెప్పుకొచ్చారు. తనలాంటి వ్యక్తికే ఇలా ఉంటే సాధారణ భక్తుల పరిస్థితి ఏమిటని లారెన్స్ ప్రశ్నించారు. ముఖ్యంగా పిల్లలు, మహిళల పట్ల సిబ్బంది ప్రవర్తన బాగోలేదని లారెన్స్ మండి పడ్డారు.
అయితే తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది వాదన వేరేలా ఉంది. రద్దీ ఎక్కువగా ఉండటం వల్లనే లారెన్స్ త్వరగా వెళ్లాలని కోరామని, దానికి ఆయన తమపై మరోలా ప్రచారం చేస్తున్నారని కొందరు సిబ్బంది అంటున్నారు. ఇందులో తప్పు ఎవరిది అనే విషయం పక్కన పెడితే.... లారెన్స్ మీడియా ముందుకు వచ్చి తన ఆగ్రహాన్ని వెల్లగక్కడంతో ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications












