నీ డిజైన్లు బాగాలేవు.. రాజమౌళికి షాక్.. మరోవైపు రూ.150 కోట్లతో ప్లాన్.. ఎన్టీఆర్, చెర్రీ కోసం..
'బాహుబలి' చిత్రాల తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి చేస్తున్న చిత్రంపై ఇటీవల ఉత్కంఠ తొలగించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ చిత్రం కోసం శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. కాగా బాహుబలి కోసం మహిష్మతి సామ్రాజ్యాన్ని నిర్మించిన జక్కన పలు అంశాలపై దృష్టిపెట్టారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన డిజైన్లతోపాటు, తన మల్టీస్టారర్ చిత్రాల హీరోయిన్ల ఎంపికపై దృష్టిపెట్టారు.

బాలీవుడ్ నుంచి భామలు
ఎన్టీఆర్, చరణ్‌ల సరసన నటించే హీరోయిన్లను బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్‌ను ఈసారి గట్టిగానే వాడేసుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. బాలీవుడ్ భామల్ని ఎంపిక చేసుకొని హిందీ మార్కెట్‌లోనూ సినిమాని ఘనంగా విడుదల చేయాలనే దిశగా రాజమౌళి ఆలోచిస్తున్నట్టు సమాచారం.

150 కోట్లతో మల్టీస్టారర్
ఎన్టీఆర్, చరణ్‌తో తెరకెక్కించే చిత్రాన్ని బాలీవుడ్ రేంజ్ చిత్రంగా మలిచేందుకు ప్లాన్ చేస్తున్నారు. సుమారు రూ: 150 కోట్ల వ్యయంతో చిత్రం రూపుదిద్దుకోనున్నట్టు సమాచారం. బాక్సింగ్ నేపథ్యంలో చిత్రం తెరకెక్కబోతోందని ప్రచారం జరుగుతున్నది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య రూపొందిస్తున్నారు.

రాజమౌళికి ఏపీ సీఎం చంద్రబాబు షాక్
కాగా దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు షాక్ ఇచ్చారు. రాజధాని అమరావతిలో నిర్మించనున్న శాసనసభ భవన నిర్మాణానికి రాజమౌళి ఇచ్చిన సూచనలను ముఖ్యమంత్రి తిరస్కరించారు. బుధవారం జరిగిన సీఆర్డీవో సమావేశంలో అసెంబ్లీ భవనాలకు సంబంధించిన రెండు డిజైన్లపై చర్చ జరిగింది. తెలుగుదనం, చరిత్ర ఉట్టిపడేలా రాజమౌళి సూచనలు ఇవ్వగా, పూర్తిగా ఆధునిక డిజైన్లవైపు చంద్రబాబు మొగ్గుచూపడం చర్చనీయాంశమైంది.

అసెంబ్లీ నిర్మాణం కోసం
రామసేతు నిర్మాణంలో ఉడత పోషించిన పాత్ర తాను రాజధాని నిర్మాణంలో పోషిస్తున్నట్టు ఈ సందర్భంగా మీడియాతో రాజమౌళి చెప్పారు. అసెంబ్లీ నిర్మాణం కోసం ఇచ్చే డిజైన్ కోసం పని చెయ్యమని సీఎం చెప్పారని తెలిపారు.

ఓ డిజైన్ ఓకే కాలేదని జక్కన వెల్లడి
తాను రూపొందించిన ఓ డిజైన్ అందరికి నచ్చింది. ఆ డిజైన్‌కు మార్పులు చేయమని సీఎం చంద్రబాబు అడిగారు. నేను తెలుగు తనం ఉట్టి పడేలా కొన్ని డిజైన్లు ఇచ్చాను. నేను వర్క్ చేసిన డిజైన్ ఓకే కాలేదు. నేను సూచించిన మార్పులను మీడియా సిటీకి వాడుకుంటామని సీఎం చంద్రబాబు చెప్పారు అని రాజమౌళి వెల్లడించారు.


Click it and Unblock the Notifications











