హాలీవుడ్ చిత్రాలపై పోరాటానికి పిలుపు
మొన్నటివరకూ తెలుగు చిత్ర పరిశ్రమ ..హాలీవుడ్ డబ్బింగ్ చిత్రాలను బ్యాన్ చెయ్యమని,లేకపోతే మనుగడ కష్టం అంటూ గొడవ చేసింది.అయితే ఎగ్జిబిటర్స్ తమకు ఫీడింగ్ కేవలం హాలీవుడ్ డబ్బింగ్ సినిమాల వల్లనే వస్తోందని ఖచ్చితంగా చెప్పటంతో వారు ఆ విషయం ప్రక్కన పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ నినాదాన్ని బాలీవుడ్ అందుకుంది. హాలీవుడ్ చిత్రాలను భారతీయ భాషలలోనికి డబ్ చేసి వదలటం పట్ల బాలీవుడ్ నిర్మాతలు, పంపిణీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ చిత్రాల ధాటికి మన చిత్రాలు పోలవనేది అందరికీ తెలిసిన సత్యం. కాని అలా డబ్ కాకుండా వాటిని నిరోధించే గట్టి చట్టమేమీ లేదు. ఇక తమిళనాడులో అయితే వీటికి మంచి ఆదరణ ఉంది. జేమ్స్ బాండ్ చిత్రాలను తమిళంలోనికి డబ్ చేసి వదిలితే తమిళ ప్రేక్షకుల ఆనందం అంతా ఇంతా కాదు'' జేమ్స్ బాండ్ తమిళ్ పేశరారే. నల్ల ఇరుకప్పా'' అంటూ వాటిని వీరు ఎగబడి చూశారు.
హాలీవుడ్ చిత్రాలను నేరుగా ఎగుమతి చేస్తే ఇంగ్లీష్ వచ్చినపై తరగతుల వారికే ఇవి అర్ధం అవుతాయి.అదే ప్రాంతీయ భాషలో డబ్ చేస్తే అన్ని క్లాసులు వాళ్లు ఎగబడి చూస్తారు. అందువల్ల ఈ డబ్బింగ్ వ్యవహారం హాలీవుడ్ పంపిణీదారులకు కూడా ఆనందంగాను లాభదాయకంగాను ఉంది. ఆ స్థాయిలో మనవారు చిత్రాలు తీయలేకపోవటంతో ఈ డబ్బింగ్ చిత్రాలకు భారతీయ ప్రేక్షకులు ఎగబడుతున్నారు. కాగా కర్నాటక మాత్రం డబ్బింగ్ చిత్రాలను అనుమతించటం లేదు. ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలలో ఎలాటి ఆంక్షలు లేవు. బాలీవుడ్ పరిశ్రమ వీటిని నిరోధించినట్లయితే తాము కూడా అలాగే చేస్తామని రాష్ట్ర ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దగ్గుబాటి సురేష్ బాబు అంటున్నారు. ఇక తమిళ చిత్రాలు తెలుగులో డబ్ అయి విజయం సాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.ఇక బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ ఈ విషయమై మాట్లాడుతూ...అన్ని భాషలవారు కలిసి హాలీవుడ్ డబ్బింగ్ చిత్రాలపై పోరాడాల్సిన అవసరం ఉంది అని పిలుపునిచ్చారు.


Click it and Unblock the Notifications











