బొత్సా సత్యనారాయణ...కొడుకు హీరోగా సినిమా
హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి, పీసీసీ ప్రెసిడెంట్ బొత్సా సత్యనారాయణ పుత్రరత్నం త్వరలో సినిమా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పేరు రంజిత్. గత కొంతకాలంగా నటన, డాన్సులు, పైట్స్ తదితర అంశాల్లో శిక్షణ తీసుకున్న రంజిత్ సినిమా ఎంట్రీకి రంగం సిద్ధమైంది. మంత్రిగారి కొడుకు కాబట్టి సినిమా అవకాశం చాలా వీజీగానే వచ్చేసింది.
ఆయన నటించబోయే సినిమా వివరాల్లోకి వెళితే...సినిమా టైటిల్ 'ఆ ఐదుగురు', 'అతనే ఓ సీంఎం' అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో ఇంకా హీరో ప్రభాస్ కజిన్ సిద్ధార్థరాజ్ కుమార్, 91.6కెడిఎం ప్రేమ హీరో క్రాంతి, కృష్ణ తేజ అనే మరో నటుడు ముఖ్య పాత్రలు పోషించనున్నారు.
ఈ చిత్రం ద్వారా శేఖర్ కమ్ముల వద్ద పని చేసిన అనిల్ గూడురు అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆ నలుగురు, వినాయకుడు చిత్రాల నిర్మాత ప్రేమ్ కుమార్ ఈచిత్రానకి నిర్మాత. మరో విశేషం ఏమిటంటే...ఇప్పటి వరకు కేవలం పాటల రచయితగానే రాణించిన సుద్దాల అశోక్ తేజ ఈ చిత్రంతో డైలాగ్ రచయితగా పరిచయం కాబోతున్నారు.
రాజకీయాల నేపథ్యంలోనే ఈచిత్రం సాగుతుందని సినిమా టైటిల్, ట్యాగ్ లైన్ బట్టి అర్థం అవుతోంది. మరి సినిమాలో రాష్ట్ర రాజకీయాల ప్రస్తావన ఏ మేరకు ఉంటుందో చూడాలి. హీరో బొత్సా రంజిత్ తండ్రి బొత్సా సత్యనారాయణ అడుగు జాడల్లో రాజకీయాల బాట పట్టకుండా సినిమాల బాట పట్టడం విశేషమే మరి.


Click it and Unblock the Notifications











