శత్రువుని అంచనా వేసి మరీ జూ ఎన్టీఆర్
చేతిలో ఆయుధం ఉంటే సరిపోదు. దాన్ని నేర్పుగా ఎలా ఉపయోగించాలో తెలిసుండాలి. మన బలాన్ని ప్రదర్శించే ముందు శత్రువునీ అంచనా వేయాలి. మా హీరో ఎన్టీఆర్ కి ఆ తెలివి... దమ్ము ఉంది. దాన్ని సరైన సమయంలో చూపిస్తుంటాడు. ఇంతకీ అతని గమ్యం ఎటు వైపో తెలుసుకోవాలంటే మా చిత్రం 'దమ్ము'చూడాలి అంటున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. అలాగే చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...ధైర్యమంటే చీకట్లో ఒంటరిగా నడుచుకొంటూ వెళ్లడం కాదు.. అదే దారిలో వచ్చే పదిమందికి వెలుగు చూపించడం. దమ్మంటే ఒంటి చేత్తో వందమందిని చితగ్గొట్టడం కాదు.. ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా దుమ్మురేపి నెగ్గుకురావడం. మా హీరో అదే చేశాడు. ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన అనుభవాలేంటో మా సినిమా చూసి తెలుసుకోండి అన్నారు. అలాగే 'పేరుకు తగ్గట్టే దమ్మున్న కథ ఇది. ఎన్టీఆర్ లోని యాక్షన్ కోణాన్ని మరో విధంగా చూపిస్తున్నాం. తెలుగు ప్రేక్షకులకు కావల్సిన అన్ని అంశాలూ ఉంటాయి అన్నారు.
త్రిష, కార్తీక హీరోయిన్స్ గా అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో సాగుతోంది. రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పోరాట సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. హీరోతోపాటు ప్రధాన తారాగణం అంతా ఇందులో పాల్గొంటోంది. అలెగ్జాండర్ వల్లభ ఈ చిత్రం గురించి చెపుతూ..''ఎన్టీఆర్ శైలిలో సాగే యాక్షన్ అంశాలతోపాటు వినోదం, భావోద్వేగాలు మిళితమైన చిత్రమిది. ఆయన పాత్ర చిత్రణ అందరికీ నచ్చుతుంది.''అన్నారు.
ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న దమ్ము పైనే ఎన్టీఆర్ పూర్తిగా దృష్టి పెడుతున్నారు.సింహాతో తన బాబాయ్ బాలకృష్ణను సూపర్ హిట్ బాటలోకి మళ్లీ ప్రయాణింప చేసిన బోయపాటి తనకీ ఆ రేంజి హిట్ ఇస్తాడని భావిస్తున్నాడు.అందుకునే ఆ సినిమా విడుదల అయ్యేదాకా నోరు విప్పకూడదని నిర్ణయించుకన్నాడు. తన సక్సెస్ మాట్లాడాలని ఎన్టీఆర్ పూర్తి స్ధాయిలో పోరాడుతున్నాడు.ఇక దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తిక నటిస్తున్నారు.తొట్టింపూడి వేణు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి బావగా కనిపించనున్నారు.భానుప్రియ ..ఎన్టీఆర్ కి తల్లిగా చేస్తోంది.ఇలా ఎక్కడా రాజీపడకుండా అద్బుతమైన తారాగణంతో ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేయాలని భావిస్తున్నారు. సంగీతం: కీరవాణి.


Click it and Unblock the Notifications











