జూ.ఎన్టీఆర్ పాదరసంలాంటి వాడు
''ఎన్టీఆర్ పాదరసం లాంటి నటుడు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోతారు. ఎలాంటి సంభాషణలైనా పలికే దమ్ము ఆయనకుంది'' అన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'దమ్ము' క్రిందటి శుక్రవారమే విడుదలైంది. హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ ఈ సక్సెస్ ని పురస్కరించుకుని మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను ఇలా స్పందించారు. అలాగే... జీవితం దేవుడిచ్చిన గొప్ప వరం. దాన్ని అనుభవించాలి అని హీరో పాత్ర ద్వారా చెప్పాం అన్నారు.
ఇక దమ్ము గురించి చెపుతూ...మా చిత్రం ఏ ఒక్క వర్గాన్నో లక్ష్యంగా చేసుకొని తీసిన సినిమా కాదు. అందరూ చూడాలనే తీశాం. ఎన్టీఆర్‌లో పలు కోణాల్ని ఆవిష్కరించాం. యాక్షన్ సన్నివేశాలతోపాటు కుటుంబ బంధాలకూ స్థానం కల్పించాం. ఇది విందు భోజనంలాంటి సినిమా... అన్నారు బోయపాటి శ్రీను. ఈ సందర్భంగా నిర్మాత కె.ఎ.వల్లభ చెబుతూ ''ఎన్టీఆర్‌తో మరో సినిమా చేయాలని ఉంది. ఆయన ఎప్పుడంటే అప్పుడే సినిమా మొదలుపెడతాం. మా బృందం పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది''అన్నారు. ఈ కార్యక్రమంలో సమర్పకుడు కె.ఎస్.రామారావు, ఛాయాగ్రహకుడు ఆర్థర్ విల్సన్ పాల్గొన్నారు.
ఎన్టీఆర్, త్రిష, కార్తీక ప్రధాన పాత్రల్లో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై నిర్మించిన 'దమ్ము' చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. శుక్రవారం విడుదలైన దమ్ము చిత్రం మార్నింగ్ షో కో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. యాక్షన్,సెంటిమెంట్,కామెడి కలిపిన ఎంటర్టైనర్ గా ఈ చిత్రం అందరినీ అలరిస్తోంది. తన నాల్గవ చిత్రాన్ని అఖండ విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, దమ్ము చిత్రాన్ని ఇంటిల్లిపాది కలిసి చూడవచ్చని, ఎవరికివారు ఒక్కొక్క ఎమోషన్‌కు కనెక్ట్ అయి, చిత్రంలో లీనమైపోతారని దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు.
తారకరామారావు నటన విషయంలో అనేక షేడ్స్ చూపించగలడని తెలిపారు. నిర్మాత వల్లభ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 1450 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశామని, 12 కోట్ల నుండి 13 కోట్ల వరకు మొదటిరోజు కలెక్షన్లు వసూలయ్యాయని, కేవలం ఆంధ్రలోనే సుమారు 9కోట్ల వసూళ్లు వచ్చాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.ఎస్.రామారావు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











