For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  MS నారాయణ నాపై వేసిన పెద్ద జోకు : బ్రహ్మానందం

  By Srikanya
  |

  హైదరాబాద్ : పరిశ్రంలో ఎమ్.ఎస్ నారాయణ, బ్రహ్మానందం మధ్య ఉన్న అనుబంధం తెలియంది కాదు. ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాలు చేసారు. బ్రహ్మానందాన్ని ఆయన అన్నయ్యా అని పిలుస్తూండేవారు. నిన్న అందరినీ వదిలేసి ఎమ్.ఎస్ నారాయణ తరలిరాని లోకాలకు తరలి వెళ్లిపోయారు. ఈ నేపధ్యంలో ఎమ్.ఎస్ నారాయణతో ఉన్న అనుబంధాన్ని బ్రహ్మానందం ఇలా గుర్తు చేసుకున్నారు.

  Brahmanandam about his friendship with MS Narayana

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
  బ్రహ్మానందం మాటల్లోనే...

  ''ఎమ్మెస్‌ను చూస్తే నాకు నవ్వు ఆగేది కాదు..

  ఎన్ని జోకులు వేసేవాడో.? సడన్‌గా ఫోన్‌ చేసి, 'అన్నయ్యా హ్యాపీ మండే' అంటాడు.

  'అదేంట్రా... హ్యాపీ బర్త్‌డేలా.. హ్యాపీ మండేలూ ఉన్నాయా' అని ఆశ్చర్యపోతే..

  'ఫోన్‌ చేశాక ఏదో ఒక సర్‌ప్రైజ్‌ ఉండాలి కదా..' అని నవ్వేసేవాడు.

  'అందర్నీ నువ్వు నవ్విస్తుంటావ్‌. నేను నిన్ను నవ్విస్తుంటా అన్నయ్యా..' అనేవాడు. నిజం చెప్పేదా.. వాడు 'అన్నయ్యా..' అంటే ఎంత ఆత్మీయంగా అనిపించేదో. ఓసారి గుండు హనుమంతరావు మీద ఓ జోకేశాడు

  'ఇతను చాలా మంచి మనిషి.. ఆ విషయం అతనొక్కడికే తెలుసు..' అన్నాడు. అంతటితో ఆగలేదు.

  'ఇతను చాలా మంచి నటుడు.. ఆ విషయం అతనికి తప్ప అందరికీ తెల్సు' అని కొసమెరుపేశాడు. ఘల్లున నవ్వాం.. గుండుతో సహా.

  ఇంకోసారి ఓ విచిత్రమైన గెటప్‌ వేసుకొని ఎమ్మెస్‌ దగ్గరకు వెళ్లా. 'అరె... ఈ గెటప్‌ ఎలా ఉందో చెప్రా' అని అడిగా. వాడప్పుడు అటు వైపు తిరిగున్నాడు. కనీసం నన్ను చూడకుండానే 'సూపరన్నయ్యా..' అన్నాడు.

  'అదేంట్రా చూడకుండా ఎలా చెప్తున్నావ్‌' అంటే 'చూసినా, చూడకపోయినా అదే చెప్పాలి కదా..' - అనేవాడి సెన్సార్‌ హ్యూమర్‌కి ఎంత సేపు నవ్వుకొన్నానో.

  ముత్యాల సుబ్బయ్యగారి దగ్గర తొలిసారి చూశా ఎమ్మెస్‌ని. చూడగానే 'ఇతనిలో ఏదో విషయం ఉంది..' అనిపించింది. తొలిసారి 'పెదరాయుడు'లో ఇద్దరం కలసి నటించాం. విరామంలో ఇద్దరూ కూర్చుని పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకొనేవాళ్లం. ఓకే వృత్తి నుంచి వచ్చినవాళ్లం కదా. సరదాగా సాయంత్రం మా ఇంటికొచ్చేవాడు. 'అమ్మా.. మధ్యాహ్నం మీ ఇంటికి భోజనానికి వస్తున్నా..' అని మా ఆవిడకు ఫోన్‌ చేసేవాడు. వెళ్తూ వెళ్తూ 'ఈ రోజు ఓ 500 గ్రాములు పెరిగిపోయుంటా..' అని నవ్వుకొంటూ వెళ్లేవాడు. ఒక తల్లికడుపున పుట్టలేదు. కానీ సినిమా తల్లి ఒడిలో పెరిగాం కదా.. మా ఇద్దరిమధ్య కావల్సినంత చనువు. అన్నదమ్ములకంటే ఎక్కువగానే ఉండేవాళ్లం. కష్టసుఖాలు పంచుకొనేవాళ్లం.

  గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ కోసం నా సినిమాల జాబితా పంపించాల్సి వచ్చింది. సినిమా పేర్లు, విడుదల తేదీ, ఆ పాత్రల పేర్లు, దర్శక నిర్మాతల పేర్లు ఇవన్నీ రాసి పంపాల్సి వచ్చింది. 'ఇదంతా ఎవడు పడతాడ్రా.. నాకొద్దు' అనేశా అసహనంతో. కానీ వాడు మాత్రం 'అది కాదన్నయ్యా.. మిగిలిన అవార్డులు వ్యక్తులు నిర్ణయిస్తారు. ఇవి రికార్డులు నిర్ణయిస్తాయి. వదులలుకోకు' అని ప్రోత్సహించాడు. ఆరోజు ఎమ్మెస్‌ ఆమాట అనకపోయి ఉంటే.. నేను గిన్నిస్‌ ప్రయత్నం చేసేవాణ్ని కాదేమో..?

  ఎమ్మెస్‌ కామెడీ చాలా సహజంగా అనిపిస్తుంది. దర్శకుడిగా 'కొడుకు' తీశాడు. ఆ సినిమా కమర్షియల్‌గా ఆడలేదు. 'మనం మనకొచ్చిన సినిమా తీశాం. ప్రేక్షకులకు నచ్చే సినిమా తీయలేదన్నయ్యా..' అని తనపై తనే జోకు వేసుకొన్నాడు. 'దూకుడు'లో హీరోలందర్నీ ఇమిటేట్‌ చేసిన సీన్‌ ఉంది కదా.. అదంటే నాకెంత ఇష్టమో.? మరొకరికి సాధ్యం కాదనే స్థాయిలో నటించేశాడు.

  'కళ్లకింద క్యారీ బ్యాగ్‌లు' అనే డైలాగ్‌ మేం కలుసుకొన్నప్పుడల్లా చర్చించుకొనేవాళ్లం. 'అన్నయ్యా.. భలే పాపులర్‌ అయ్యిందా డైలాగ్‌...' అని మురిసిపోయేవాడు. 'అదుర్స్‌'లోనూ తన కామెడీ నాకు నచ్చుతుంది. ఈమధ్యే 'పండగ చేస్కో'లో ఇద్దరం కలసి నటించాం.

  మొన్నామధ్య ఫోన్‌ చేశాడు. 'అన్నయ్యా భీమిలి వెళ్తున్నా. అక్కడ ఇంటికి రంగులు వేయించాలి..' అన్నాడు. సడన్‌గా ఓ రోజు పేపర్‌ తిరగేస్తే.. ఎమ్మెస్‌కి బాలేదని తెలిసింది. వెంటనే ఫోన్‌ చేశా. 'భీమవరం నుంచి హైదరాబాద్‌ తీసుకొస్తున్నాం అంకుల్‌' అన్నారు పిల్లలిద్దరూ. గురువారం ఉదయం శంషా బాద్‌లో షూటింగ్‌లో ఉన్నా. విక్రమ్‌ ఫోన్‌ చేశాడు. 'డాడీకి స్పృహ వచ్చింది. కాగితంపై మీ పేరు రాశారు.. చూడాలనివుందట' అన్నాడు. శంషాబాద్‌ నుంచి ఆసుపత్రికి ఎలా వెళ్లానో అర్థం కాలేదు.

  వెళ్లి చూస్తే.. ఐసీయూలో కనిపించాడు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఎమ్మెస్‌ని అలా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు.

  దగ్గరకు వెళ్తే.. గుర్తుపట్టాడు. నా చేయి తీసుకొని తన గుండెలపై వేసుకొన్నాడు.

  నాపై జోకులు వేయడానికైనా మామూలు మనిషి అవుతాడనుకొన్నా. కానీ.. ఇంత పెద్ద జోక్‌ వేస్తాడనుకోలేదు. ఎప్పుడూ నవ్వులు పంచే నా ఎమ్మెస్‌ తొలిసారి కన్నీళ్లనూ పరిచయం చేశాడు. ఐ మిస్‌ యూ.. తమ్ముడూ..''
  - బ్రహ్మానందం

  English summary
  Brahmanandam remembers his relation with M.S Narayana with tears.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X