మ్యూజిక్ చానల్ క్రియేటివ్ హెడ్‌గా బ్రహ్మానందం
హైదరాబాద్: తమ చిత్రంలో మ్యూజిక్ చానల్ క్రియేటివ్ హెడ్‌గా బ్రహ్మానందం చేసే నటన నవ్వులు పండిస్తుందని చెప్తున్నారు దర్శకుడు సూర్య రాజు. హను సినీ క్రియేషన్స్ పతాకంపై రాజేశ్‌కుమార్, కుమార్‌రాజా సంయక్తంగా నిర్మించిన 'మైత్రి' చిత్రంతో ఆయన దర్శకునిగా పరిచయమవుతున్నారు. నవదీప్, సదా జంటగా నటించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన చిత్రంలో హైలెట్స్ ని వివరించారు.
ఆయన మాట్లాడుతూ..."మైత్రి పాత్ర, ఆ పాత్రలో సదా నటన సినిమాకి హైలైట్. తన కెరీర్‌లోనే తొలిసారి 'మైత్రి'గా అర్థవంతమైన పాత్రని సదా చేసిందనేది నా అభిప్రాయం. అలాగే 'మేడిన్ ఇండియా' అనేది పది కాలాల పాటు నిలిచే పాట. ఈ పాటలో వివిధ భాషలవారి కట్టుబొట్టుల్లో సదా కనిపించి, అలరిస్తుంది. అలాగే ఇప్పటివరకు ఏ సినిమాలోనూ కనిపించని విధంగా రీతిలో ఓ పాటలో గ్లామర్‌గా కనిపించి ఆశ్చర్యపరుస్తుంది. ఓ మ్యూజిక్ చానల్ క్రియేటివ్ హెడ్‌గా బ్రహ్మానందం, తాగుబోతుగా ఉత్తేజ్ మంచి కామెడీ పండించారు. అల్లరి సుభాషిణి ఓ ఆశ్చర్యకరమైన పాత్రలో కనిపిస్తుంది.'' అని చెప్పారు సూర్యరాజు.
కథ గురించి వివరిస్తూ... దీపు వీడియో ఆల్బమ్ డైరెక్టర్. భారతీయ స్త్రీ కట్టు బొట్టు, ఆమె గొప్పదనాన్ని చాటిచెప్పే ఉద్దేశంతో ఓ వీడియో ఆల్బమ్ రూపకల్పనకు నడుం బిగిస్తాడు. మొదట ఓ అమ్మాయితో షూటింగ్ ప్రారంభిస్తాడు. అయితే మైత్రిని చూశాక, అప్పటిదాకా పనిచేస్తున్న అమ్మాయికి బై చెప్పి, మైత్రిని ఒప్పించి, ఆమెతో ఓ బంగళాలో షూటింగ్ జరుపుతాడు. ఆ సందర్భంగా ఆ బంగళాలో అనూహ్యమైన సంఘటనలు కొన్ని జరుగుతాయి. అవన్నీ ప్రేక్షకులకి ఉత్కంఠ కలిగిస్తాయి. ఆ సంఘటనల వెనుక ఎవరున్నారనేది సస్పెన్స్ అన్నారు.
బ్రహ్మానందం, ఉత్తేజ్, చిత్రం శ్రీను, సుమన్ శెట్టి, బిక్షు, కళ్లు చిదంబరం, సత్యం రాజేష్, అర్జున్, లక్ష్మణ్, పాపారాయుడు, వంశీ, కీర్తి, అల్లరి సుభాషిణి, జయవాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వికాస్, కెమెరా: సెల్వ, ఎడిటింగ్: వినయ్, నిర్మాత: రాజేష్‌కుమార్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: సూర్యరాజు.


Click it and Unblock the Notifications











