బ్రహ్మానందం చెప్పారు, డాక్టరేట్ వచ్చింది: అలీ

హైదరాబాద్ : తెలుగు స్టార్ కమెడియన్ అలీ 'అకాడెమీ ఆఫ్ యూనివర్శల్ గ్లోబ్ పీస్' సంస్థ తరుపు గౌరవ డాక్టరేట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ హాస్యనటుడు బ్రహ్మానందం అలీని తన నివాసానికి ఆహ్వానించి సత్కరించారు. బ్రహ్మనందం దంపతులు, ఇతర హాస్య నటుల సమక్షంలో గురువారం ఈ సత్కారం జరిగింది.
బ్రహ్మానందం మాట్లాడుతూ...అలీకి గౌరవ డాక్టరేట్ రావడం ఆనందదాయకం. మన పరిశ్రమలో గౌరవ డాక్టరేట్ అర్హులైన హాస్య నటులు ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా మందిలో అంతటి ప్రతిభ ఉంది. అలీతో ఆ పరంపర మొదలయిందని నమ్ముతున్నాను. అలీ నాకు తమ్ముడు లాంటి వాడు. మున్ముందు ఇలాంటి పురస్కారాలు మరిన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను' అన్నారు.
అలీ మాట్లాడుతూ..'గౌరవ డాక్టరేట్ అందుకోవడం కన్నా మా సీనియర్ డాక్టర్ బ్రహ్మానందంగారి చేతుల మీదుగా ఆత్మీయ సత్కారాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. బ్రహ్మానందం గారికి డాక్టరేట్ వచ్చినప్పుడు నా తర్వాత నీకే వస్తుందిరా అన్నారు. ఆయన మాటలను తథాస్తు దేవతలు విని ఆశీర్వదించినట్లున్నారు. నాకు ఆ గౌరవం దక్కింది' అన్నారు.
అలీని పూల మాలలు, బొకేలతో సత్కరించిన ఈ కార్యక్రమంలో సినీ నటులు సునీల్, కృష్ణ భగవాన్, పోసాని కృష్ణమురళి, శ్రీనివాస్ రెడ్డి, గుండు హనుమంతరావు, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











