బ్రహ్మీ పాట వాళ్లు తీసేసారు..వీళ్లు పెడుతున్నారు
హైదరాబాద్ : బ్రహ్మానందం మీద కామెడీ లేకుండా ఓ మాదరి చిత్రం చేయాలంటే దర్శక,నిర్మాతలు భయపడుతున్నారు. ఆయన కామెడీనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుందని భావిస్తున్నారు. అందులో భాగంగా బ్రహ్మానందం మీద పాట సైతం పెట్టడానికి వెనకాడటం లేదు. రీసెంట్ గా ఆటోనగర్ సూర్య చిత్రంలో బ్రహ్మీ మీద పాట పెట్టారు. అయితే రిలీజ్ అయ్యాక ఆ పాటను తీసేసారు. ఆ పాట సినిమా కు అడ్డంకిగా మారిందని అందరూ అన్నారు. ఇప్పుడు అంజలి ప్రధాన పాత్రలో వస్తున్న గీతాంజలి చిత్రంలోనూ బ్రహ్మానందం మీద పాటను పెడుతున్నారు. ఈ విషయాన్ని కోన వెంకట్ మీడియాకు తెలియచేసారు. ఆ పాటను త్వరలో విడుదల చేయబోతున్నారు కూడా.
అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గీతాంజలి'. శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్ కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ నేపథ్య గళాన్ని అందిస్తున్నారు. రాజ్‌కిరణ్ దర్శకుడు. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పిస్తున్నారు.చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల రెండో వారంలో పాటల్ని విడుదల చేస్తారు. సోమవారం చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.

కోన వెంకట్ మాట్లాడుతూ ''కథపై నమ్మకంతో నేనే ఈ చిత్రాన్ని నిర్మించాలనుకొన్నా. ఆ సమయంలోనే ఎం.వి.వి.సత్యనారాయణ పరిచయమయ్యారు. దీంతో మేమిద్దరం కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. గీతాంజలి అనే యువతి జీవితం చుట్టూ సాగే కథ ఇది. ఆ అమ్మాయి ఎవరన్నదే ఆసక్తికరం. ఉత్కంఠ, వినోదం మేళవింపుతో రూపొందుతున్న చిత్రమిది. బ్రహ్మానందం పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ఆయనపై ప్రత్యేకంగా ఓ పాట ఉంది. దాన్ని త్వరలోనే విడుదల చేస్తాం. శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్ పాత్రలు కథను మలుపు తిప్పుతాయి. వచ్చే నెల మొదటి వారంలో సినిమాను విడుదల చేస్తామ''అన్నారు.
''అందరూ సొంత సినిమాలా భావించి పని చేశారు. అంజలి పాత్రతో పాటు సాయి శ్రీరామ్ కెమెరా పనితనం, ప్రవీణ్ లక్కరాజు సంగీతం చిత్రానికి బలాన్నిస్తాయి'' అన్నారు నిర్మాత. రావు రమేష్, అలీ, రఘుబాబు, ఝాన్సీ, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











