ఆటోలో బ్రహ్మీ: మోహన్ బాబు సైకిల్ అనుభవం
హైదరాబాద్: విష్ణు, హన్సిక జంటగా రూపందుతున్న దైనికైనా రెడీ ఈ నెల 24వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల ఆడియో కూడా విడుదల చేసుకున్న ఈ సినిమా కోసం ఒక రోజు మిగిలి ఉన్న ప్యాచ్ వర్క్‌ను బుధవారం హైదరాబాదులోని గంధర్వమహల్ సెట్లో దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి చిత్రీకరించారు.
విష్ణు, బ్రహ్మానందం, ఏవియస్ తదితరులు షూటింగులో పాల్గొన్నారు. ఈ షూటింగుకు హాజరు కావడం కోసం బ్రహ్మానందం ఇంటి నుంచి ఆటో ఎక్కి లోకేషన్‌కు చేరుకోవడం యూనిట్ సభ్యులను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా కారులో వచ్చే బ్రహ్మానందం ఆటోలో రావడమే ఆ ఆశ్చర్యానికి కారణం.
కారు డ్రైవర్ ఆలస్యం చేయడంతో లోకేషన్‌లో అందరూ తన కోసం నిరీక్షిస్తారని చెప్పి సకాలంలో చేరుకోవడానికి బ్రహ్మానందం ఆటోలో వచ్చారు. బ్రహ్మానందం ఆటోలో రావడం చూసి ఏవియస్ అవాక్కయ్యారట. అప్పుడు లోకేషన్‌లో పక్కనే అయ్యప్పమాలలో ఉన్న ప్రముఖ నటుడు మోహన్ బాబు కలుగుజేసుకుంటూ "మనం సైకిల్ మీద వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడే మరిచిపోయావా ఏవియస్... బ్రహ్మానందం సిన్సియారిటీకీ హ్యాట్సాఫ్" అని అన్నారట. బుధవారం ఉదయం 8 గంటలకు ఈ సంఘటన చోటు చేసుకుంది.
పేరడీ సాంగ్‌కి సంబంధించిన ప్యాచ్‌వర్క్‌ను అక్కడ చిత్రీకరించారు. ఆద్యంతం వినోదం పంచే చిత్రంగా దేనికైనా రెడీ సిద్ధమవుతోంది. మోహన్ బాబు నిర్మాతగా, ఆరియానా, వివియానాలు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.


Click it and Unblock the Notifications











