ఆ విగ్రహం ఎక్కడ, బ్రహ్మానందం?
ఆయనను నటుడిగా గౌరవిస్తాను. మనిషిగా చీదరించుకుంటాను అని కొన్నేళ్ళ క్రితం శివాజీరాజా కమెడియన్ బ్రహ్మానందంపై ఎఫ్‌ఎన్‌సిసి క్లబ్ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. కొన్ని విషయాల్లో బ్రహ్మానందంను దులిపేయడానికి శివాజీరాజా ఆనాడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంఘటన జరిగిన కొన్నిరోజుల తర్వాత తెలుగు కమెడియన్లు అందరూ ఎవిఎస్ నాయకత్వం కింద చేరారు. బ్రహ్మానందం చిన్న ఆర్టిస్టులను కించపరుస్తున్నారని వాళ్ళు విమర్శలు గుప్పించుకుంటూ వచ్చారు.
ఫిల్మ్‌నగర్‌లో ఒకనాటి గొప్ప హాస్యనటుడు రేలంగి విగ్రహం నెలకొల్పడానికి సేకరించిన నిధులను బ్రహ్మానందం దుర్వినియోగం చేశారన్నది వారి ప్రధాన విమర్శ. హాస్యనటుల మధ్య కోపతాపాలు చోటు చేసుకున్న తరుణంలో కొందరు తెలివైన వారు తలదూర్చారు. సమస్య పరిష్కరిస్తానని ముందుకు వచ్చిన దాసరి నారాయణ రావును నమ్మి కమెడియన్లు ఆయన ముందు వాలిపోయారు. ఆ సమావేశానికి వచ్చిన బ్రహ్మానందం సినిమా ఫక్కీలో రేలంగి ఛాతీ సైజు కాంస్య విగ్రహంతో అక్కడ ప్రత్యక్షమయ్యారు. సేకరించిన నిధులను తాను దుర్వినియోగం చేయలేదని, ఆ విగ్రహానికే ఖర్చు చేశానని బ్రహ్మానందం నమ్మబలికాడు. కొందరు నమ్మారు. కొందరు నమ్మలేదు. ఈ ఉదంతం జరిగి ఆరేడేళ్ళు అవుతోంది. ఇంతవరకు రేలంగి విగ్రహాన్ని ఎక్కడా ప్రతిష్టించలేదు. ఆ విగ్రహం ఎక్కడ ఉన్నట్టు? విగ్రహ ప్రతిష్టకు ఏ ఇబ్బందులు ఎదురైనట్టు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బ్రహ్మానందం సినిమా నటిస్తూ పరమానందం చెందుతున్నారు?


Click it and Unblock the Notifications