ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ కన్నుమూత.. సినీ ఇండస్ట్రీలో విషాదం
Recommended Video
ప్రముఖ నటుడు, టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చేరారు. క్రమంగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూనే ఆయన మృతి చెందారు.

వేణు మాధవ్ స్వతహాగా మిమిక్రీ ఆర్టిస్ట్
వేణు మాధవ్ స్వతహాగా మిమిక్రీ ఆర్టిస్ట్. సూర్యపేట జిల్లా కోదాడలో ఆయన జన్మించారు. వేణు మాధవ్ తండ్రి టెలిఫోన్ డిపార్ట్‌మెంట్ లో లైన్ ఇన్‌స్పెక్టర్ పనిచేసేవారు. అమ్మ ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్ గా పని చేసేది. 5వ తరగతి దాకా ఊళ్ళోనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న ఆయన.. అమితాబ్ బచ్చన్, ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సులేయడం, వారిని అనుకరించి మాట్లాడటం లాంటివి చేసి ఆకర్షించేవారు.

సినీరంగంలోకి వేణు మాధవ్
1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన ‘సంప్రదాయం' చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టారు వేణు మాధవ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తొలిప్రేమ' సినిమాతో మంచి బ్రేక్ తెచ్చుకొని తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్‌గా రాణించారు. అదే ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘హంగామా' సినిమాతో హీరో కూడా అయ్యారు వేణు మాధవ్.

వేణు మాధవ్ సినిమాలు
ప్రియమైన నీకు, ఆది, సొంతం, తొలిప్రేమ, సింహాద్రి, సై, ఛత్రపతి, దిల్, సాంబ, వెంకీ తదితర సినిమాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకుల మన్ననలు పొందారు వేణు మాధవ్. పలు టీవీ షోల్లో హోస్ట్ గా కూడా చేశారు.

సినీ ప్రముఖుల సంతాపం
వేణు మాధవ్ మరణ వార్త తెలిసి టాలీవుడ్ సర్కిల్స్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల స్పందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు
600 పైగా సినిమాల్లో నటించిన వేణు మాధవ్ హాస్యనటుడిగా టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో నిలిచి పోయే పాత్రలు చేశారు. 'లక్ష్మి' సినిమాకు గాను ఉత్తమ హాస్యనటుడిగా వేణు మాధవ్‌కి నంది అవార్డు లభించింది.

అందరు అగ్ర హీరోల సరసన
సెప్టెంబర్ 28 వ తేదీ 1968 సంవత్సరం జన్మించిన వేణు మాధవ్.. చిన్నతనం నుంచే సినిమాలు, మిమిక్రీ పట్ల ఆసక్తి కనబర్చేవారు. వేణు మాధవ్ భార్య పేరు శ్రీవాణి. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సినీ గడప తొక్కాక దాదాపు అందరు హీరోలతో కలిసి నటించారు వేణు మాధవ్. తమ్ముడు, పోకిరి, ఖతర్నాక్, యోగి, దేశముదురు, సంక్రాంతి, మాస్, అతనొక్కడే లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో ఆయన నటించారు.

మూడేళ్ళుగా సినిమాలకు దూరం
మూడేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉన్న వేణు మాధవ్.. చివరగా రుద్రమదేవి సినిమాలో నటించారు. మా అసోసియేషన్ కార్యనిర్వాహక సభ్యుడిగా, ట్రెజరర్ గా కూడా పని చేశారు. అనారోగ్యంగా కారణంగా సినిమాలకు దూరమైన వేణు మాధవ్ కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ అనంత లోకాలకు వెళ్లిపోయారు.


Click it and Unblock the Notifications











