డాన్స్ రిహార్సల్స్ లో అల్లు అర్జున్ (ఫొటో)
హైదరాబాద్ : సాధారణంగా అల్లు అర్జున్ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది అతని డ్యాన్స్... స్టైల్. రెండింటినీ కలిపి ఆయన వేసే స్టెప్పులు ప్రేక్షకుల్ని అలరిస్తుంటాయి. ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ తన స్త్టెల్ డ్యాన్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. 'రేసుగుర్రం' ద్వారా అర్జున్ వైవిధ్యమైన స్టెప్పులతో రానున్నాడు. సోమవారం నుంచి హీరో,హీరోయిన్స్ పై 'డౌన్ డౌన్ డుప్పా...' పల్లవితో సాగే పాటని చిత్రీకరించనున్నారు. దీని కోసం ప్రత్యేకమైన సెట్‌ని రూపొందించారు. రిహార్శిల్స్ చేసారు. మీరు చూస్తున్న ఫోటో ఆ రిహార్సిల్స్ దే. ఇదో పార్టీ సాంగ్.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'రేసు గుర్రం'. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా ఇదే. టైటిల్ కు తగ్గట్లు రేసు గుర్రంలాగానే ఈ చిత్రం విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. సంక్రాంతికి విడుదల అవుతుందనుకున్న ఈ చిత్రం పిభ్రవరికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే విడుదల తేదీ ని ఏప్రియల్ 4 వ తేదీకి మార్చారని తెలుస్తోంది. పూర్తై ఫస్ట్ కాపీ పట్టటానికి ఇంకా రెండు నెలలు సమయం పట్టేటట్లు ఉందని అందుకే విడుదల ను ముందుకు నెట్టారని చెప్తున్నారు. చిత్రంలో అల్లు అర్జున్ క్యారక్టరైజేషన్ చాలా విభిన్నంగా ఉండబోతోందని దర్శకుడు చెప్తున్నాడు. ఫన్,యాక్షన్ కలిపి మరో కిక్ లా రూపొందిస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.
సురేంద్రరెడ్డి మాట్లాడుతూ... "పరుగు పందెంలో గెలవడం రేసుగుర్రం విధి. జీవితమనే పరుగు పందెంలో గెలవడం మనిషి విధి. అయితే... ఈ రేసులో అడపాదడపా గెలిచేవారు కొందరైతే... గెలుపుని ఇంటిపేరుగా మార్చుకున్నవాళ్లు కొందరు. ఆ కొందరిలో ఒకడి కథే... 'రేసుగుర్రం. బాధ్యతాయుతమైన ఓ యువకుని కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు" అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ... "గెలుపు కోసం బరిలో దిగినవాడికి... లక్ష్యం మాత్రమే కనిపించాలి. ఎదురొస్తున్న సవాళ్లు, పరిగెట్టిస్తున్న పరిస్థితులు, చుట్టుముడుతున్న సమస్యలూ ఇవేమీ పట్టించుకోకూడదు. రేసులో నిలవాలన్నా, నిలిచి గెలవాలన్నా పోరాడాల్సిందే. ఆ యువకుడూ అదే చేశాడు. 'రేసు గుర్రం'లా దూసుకుపోయాడు. మరి విజయం అందిందా? లేదా? ఇంతకీ ఈ రేసు దేని కోసం? తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే!" అన్నారు.
ఇద్దరమ్మాయిలతో... సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందిన తరువాత బన్ని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అలాగే ఊసరవెల్లి సినిమా తరువాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఇతనికీ ఈ సినిమా విజయం ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే ఊసరవెల్లి అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఈ చిత్రంలో సలోని సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుంది.
కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.


Click it and Unblock the Notifications












