ఓయూలో ‘బిజినెస్ మేన్’ రీళ్లు దగ్ధం
మహేష్ బాబు హీరోగా నటించిన 'బిజినెస్ మేన్' సినిమా రీళ్లను ఏబీవీపీ కార్యకర్తలు ఉస్మానియా యూనివర్శిటీలో బుధవారం దగ్ధం చేశారు. బిజినెస్ మేన్ సినిమాలోని 'వి లవ్ బ్యాడ్ బాయ్స్' పాట హిందువుల మనో భావాలను కించ పరిచేలా ఉందని, రాముడిని అవమాన పరిచేలా ఉందని, సమాజాన్ని చెడుమార్గంలో నడిపించేలా ఉందని ఏబీవీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సినిమా నుంచి ఆ పాట తొలగించాలని, దర్శక నిర్మాతలు క్షమాపణలు చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఈ పాటపై ఇప్పటికే 'భజ్ రంగ్ దళ్' కార్యకర్తలు సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు ఈ కేసు విషయమై పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహా కోరగా సినిమాటో గ్రఫీ చట్టంలోని సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని సూచించినట్లు సమాచారం.
మరో వైపు పూరి జగన్నాథ్...ఈ ఆందోళన కార్యక్రమాలపై స్పందిస్తూ ఇలాంటి వాళ్ల పీక పిసకాలి అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పూరి వ్యాఖ్యలు కూడా వివాదం మరింత ముదరడానికి కారణం అయింది.
మహేష్ బాబు-కాజల్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బిజినెస్ మేన్ సినిమాను ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది.


Click it and Unblock the Notifications











