వెయ్యి మందితో ‘కెమెరా... రాంబాబు’ క్లైమాక్స్ డబ్బింగ్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. ఈచిత్రం క్లైమాక్స్ సన్నివేశం కోసం ఆ మధ్య వేలాది మంది అభిమానులను షూటింగుకు ఆహ్వానించి...పవన్ వెనక వారు నడుస్తుండగా భారీగా చిత్రీకరించిన విషయం తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీ ఇందుకు వేదికైంది. వేలాది మంది మధ్య పవర్ స్టార్ పవర్ ఫుల్ డైలాగులు చెప్పే సన్నివేశం అది.
తాజాగా ఈ చిత్రం క్లైమాక్స్ డబ్బింగ్‌లో కూడా దాదాపు వెయ్యి మందిని భాగస్వామ్యం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఫ్లోర్ ను అద్దెకు తీసుకుని వారిని అక్కడికి రప్పించి......వారి అరుపులు, కేకలు రికార్డు చేయనున్నారని, ఇప్పటికే డబ్బింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ డైలాగులను అందులో కలపనున్నారని తెలుస్తోంది.
కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం భారీ అంచానల మధ్య అక్టోబర్ 18న విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. పవన్‌తో పూరి జగన్నాథ్ చేసిన 'బద్రి' సినిమా భారీ విజయం సాధించిన నేపత్యంలో ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పవర్ ఫుల్ డైలాగులతో తెరకెక్కించాడు దర్శకుడు.
ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటించాడు. పవన్ కు జోడీగా తమన్నా నటించింది. అన్యాయాలను ఎదురించే మీడియా జర్నలిస్టు పాత్ర పోషించిన జగన్ రాజకీయ నాయకులు, అక్రమార్కులకు చండాడే పాత్రలో అభిమానులను అలరించనున్నాడు.
ఇటీవల విడుదలైన ట్రైలర్లో...ఉంచుకోవడానికి ఉయ్యాలూగడానికి మీడియా ఉంపుడుగత్తె కాదు అంటూ పవన్ చెప్పిన డైలాగులు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. పవర్ స్టార్ కెరీర్లోనే ఇదో సంచలన చిత్రంగా నిలుస్తుందని, గబ్బర్ సింగ్ చిత్రం రికార్డును క్రాస్ చేస్తుందని నిర్మాత దానయ్య ఇటీవల ప్రకటించడం కూడా సినిమా రేంజ్ ఏమిటో స్పష్టం చేస్తోంది.
ప్రకాష్ రాజ్, గ్యాబ్రియల్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్.


Click it and Unblock the Notifications











