‘రభస’ వివాదం: మంచు లక్ష్మి, బెల్లంకొండపై కేసులు
హైదరాబాద్: 'రభస' సినిమాకు సంబంధించిన వివాదంలో మంచు లక్ష్మి, బెల్లంకొండ సురేష్ పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. బెల్లంకొండ సురేష్ తమకు ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వలేదని ఆయన ఇంటివద్ద మంచు లక్ష్మికి చెందిన వ్యక్తులు ధర్నా చేసిన సంగతి తెలిసిందే.
అసలు వివాదం ఏమిటి?
మంచు లక్ష్మి నిర్మించిన ఊ కొడతారా...ఉలిక్కి పడతారా చిత్రం గంధర్వ మహల్ సెట్ ని నిర్మాత బెల్లంకొండ సురేష్ రభస చిత్రం కోసం అద్దెకు తీసుకున్నారు. ఇందు నిమిత్తం 58 లక్షల రూపాయలు ఇస్తానని మంచు లక్ష్మితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఒప్పుకున్న పేమెంట్ ఇవ్వకపోవటంతో మంచు లక్ష్మి అనుచురులు ఇలా ధర్నాకు దిగారు. డబ్బులు ఇచ్చే వరకు 'రభస' సినిమా విడుదల కానివ్వమని ఆందోళనకు దిగారు.

బెల్లంకొండ సురేష్ వాదన ఇలా ఉంది..
గతంలో తన బ్యానర్ లో మంచు విష్ణుతో ఓ చిత్రం నిర్మించేందుకు అరవై లక్షలు అడ్వన్స్ ఇచ్చానని, అయితే సినిమా చేయలేక పోయామని....తనకు ఇవ్వాల్సిన ఆ మొత్తాన్ని సెట్ విషయంలో అడ్జెస్ట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నామని, మంచు విష్ణు సైతం దానికి ఒప్పుకున్నారని అన్నారు. అయితే మంచు లక్ష్మి మాత్రం దానికీ, దీనికి లింకు పెట్టవద్దని, తన డబ్బులు తనకు ఇవ్వాలని కోరుతోందని, అది ఎంతవరకూ న్యాయమని ప్రశ్నించారు. మంచు విష్ణుకు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బుతో చిత్రం ప్రారంభిద్దామనుకున్నా కథ సిద్దం కాకపోవటంతో ప్రారంభం చేయలేకపోయామని అన్నారు.
'రభస'పై ఎఫెక్టు పడుతుందా?
బెల్లంకొండ సురేష్ నిర్మించిన 'రభస' చిత్రం రేపు (ఆగస్టు 29)న విడుదల అవుతోంది. ఎన్టీఆర్,సమంత, ప్రణీత నటించిన ఈచిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించారు. ప్రపంచ వ్యాప్తగా 1200 థియేటర్లలో ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ వివాదం ప్రభావం సినిమాపై పడుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











