twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీడీ షాపు ధ్వంసం,పవన్ ఫ్యాన్స్ పై కేసు

    By Srikanya
    |

    గవర్నర్‌పేట, విజయవాడ: బీసెంట్‌రోడ్డులోని ఓ సీడీల దుకాణంపై పవన్‌కల్యాణ్‌ అభిమానులు దాడి చేశారు. పవన్‌కల్యాణ్‌ నటించిన 'అత్తారింటికి దారేది?' సినిమా విడుదల కాకుండానే సీడీలు అమ్ముతున్నారని సమాచారం తెలియటంతో అభిమానులు మూకుమ్మడిగా బృందావన్‌ కాంప్లెక్సులోని 'శ్రావ్య డీవీడీ సెంటరు' వద్దకు విచ్చేశారు. సీడీల కోసం వాకబు చేశారు.

    అభిమానులు గుంపులుగా వస్తున్న విషయాన్ని గమనించిన షాపు యజమాని సంకాబత్తుల జయదేవ్‌ భయంతో దుకాణానికి తాళం వేసి వెళ్లిపోగా అభిమానులు ఆగ్రహంతో దుకాణం తాళం పగలకొట్టి షాపులోకి అక్రమంగా ప్రవేశించారు. సీడీలను చిందరవందరగా పడేశారు. 'అత్తారింటికి దారేది?' సీడీల కోసం షాపు మొత్తం గాలించారు. ఎక్కడా సీడీలు కనిపించకపోవటంతో షాపు బయట ఉన్న బ్యానర్లు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. ఉదయం 5 గంటలకే దుకాణం తెరచి సీడీలు అమ్మేశారని అభిమానులు ఆరోపిస్తున్నారు.

    పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే సరికి అభిమానులు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు దుకాణాన్ని పరిశీలించి తాళం వేయించారు. అనంతరం అక్కడ పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. కొంత మంది యువకులు తమ దుకాణానికి వచ్చి అత్తారింటికి దారేది సినిమా సీడీలు అడిగి ఆ తరువాత దుకాణంలోని వస్తువులను పగలకొట్టారంటూ సంకాబత్తుల జయదేవ్‌ గవర్నరుపేట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

    అడపా ఆదిత్య, నిఖిల్‌ సాయికృష్ణ అనే ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జయదేవ్‌కు దగ్గరి బంధువు కుమార్‌ ఇదే దుకాణంలో ఉంటారని ఇతనే సీడీల రాకెట్‌కు సూత్రధారి అని పవన్‌కల్యాణ్‌ అభిమానులు ఆరోపిస్తున్నారు. గవర్నర్‌పేట సీఐ మహేంద్ర కేసు దర్యాప్తు చేస్తున్నారు.

    సీమాంధ్ర ఉద్యమ ప్రభావం వల్ల గత నెలలో విడుదల కావల్సిన 'అత్తారింటికి దారేది' పలుమార్లు వాయిదా పడింది. ఈసారి దసరా పండక్కి దీన్ని విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకొంది. అయితే ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు దిగ్భ్రాంతి కలిగించే విషయం తెలిసింది. 'అత్తారింటికి దారేది' సినిమా అంతర్జాలంలో లీకైందని. సినిమా అంతా కాదు గానీ.. తొలి 90 నిమిషాలూ బయటకు వచ్చేసింది. దాంతో అంతటా ఓ షాక్‌. తొలుత చిత్రబృందం కూడా ఈ విషయాన్ని నమ్మలేదు. కానీ నిజం తెలిసి అప్రమత్తమయ్యేలోగా ఈ పైరసీ విషంలా పాకేసింది.

    ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమైన ఈ రోజుల్లో 'అత్తారింటికి దారేది' సినిమా నెట్‌ ద్వారా క్షణాల్లో బట్వాడా అయిపోయింది. ఈ లీకేజీ కేంద్రం కాలిఫోర్నియా అని తేలింది. దీని మీద వెంటనే స్పందించిన చిత్రబృందం సీఐడీ అదనపు డీజీకి ఫిర్యాదు చేసింది. చిత్రసీమకు అనుసంధానంగా పనిచేస్తున్న యాంటీ పైరసీ సెల్‌ చురుగ్గా పనిచేసి కొన్ని ఐపీ నెంబర్లను పట్టుకోగలిగింది. దాంతో పాటు సినిమాని ప్రదర్శిస్తున్న కొన్ని సైట్లను కూడా నియంత్రించింది. సోమవారం ఈ పైరసీకి కారణమైన ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

    నష్టాన్ని కొంతమేర ఆపినా, అప్పటికే పైరసీ తన ప్రభావాన్ని చూపించింది. తెల్లారేసరికి సినిమా కాస్తా సీడీల్లోకి ఎక్కేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, కృష్ణాజిల్లా పెడన, మచిలీపట్నంలాంటి చోట్ల రూ.50లకు 'అత్తారింటికి దారేది' సీడీలను అమ్మేశారు. బెంగళూరులోనూ పైరసీ సీడీలు భారీ సంఖ్యలో కనిపించాయి. ఆన్‌లైన్‌ పైరసీని కొంత వరకూ నియంత్రించగలిగిన చిత్రబృందం... ఈ సీడీలను మాత్రం అడ్డుకోలేకపోయింది.

    English summary
    
 Pawan Kalyan’s much awaited film Attarintiki Daaredi has been released illegally Yesterday. It is said that a lengthy footage of the film has been leaked online and some people have even downloaded it. Producer BVSN Prasad will very soon file a complaint with the cyber cell seeking protection for his film. The leading lady of AD, Samantha tweeted that she was devastated hearing this news. She has requested people to wait for the film to come to theatres.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X