మోహన్ బాబుపై కేసు నమోదు
హైదరాబాద్ : 'దేనికైనా రెడీ' మూవీ వివాదం నేపథ్యంలో బ్రాహ్మణులు కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు మల్కాజ్ గిరి పోలీసులు ఆ చిత్రం నిర్మాత మోహన్ బాబు, హీరోమంచు విష్ణు, కమెడియన్ బ్రహ్మానందం, దర్శకుడు జి నాగేశ్వరరెడ్డిపై కేసు నమోదు చేసారు.
వారిపై ఐపిసి 150ఎ, 120బి, 153 ఎ, 295 ఎ, 298 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 'దేనికైనా రెడీ' చిత్రం తమ మనో భావాలను దెబ్బ తీసే విధంగా ఉందని, బాహ్మణులు మాంసం తిన్నట్లుగా, బ్రాహ్మణ మహిళను వ్యాంపుగా చూపించి అవమాన పరిచారని బ్రాహ్మణులు ఆరోపిస్తున్నారు.
బ్రాహ్మణుల ఆందోళన కార్యక్రమాలపై మోహన్ బాబు వ్యంగ్యంగా మాట్లాడటం.....తన ఇంటి వద్ద ఆందోళనకు దిగిన వారిపై మోహన్ బాబు అనుచరులు దాడి చేయడంతో వివాదం తారా స్థాయికి చేరింది. ఇరు వర్గాలు పరస్పరం హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే.
బ్రాహ్మణులను కించ పరిచే విధంగా ఉన్న దేనికైనారెడీ సినిమాను నిషేధించాలని, తమపై దాడికి ప్రేరేపించిన సినీనటులు మోహన్‌బాబు, విష్ణులతోపాటు దాడి జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరో వైపు తమ ఇంటిపై బ్రాహ్మణులు దాడి చేసారని, తాము బ్రతికుండగానే పిండం పెట్టారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని విష్ణు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











