పుట్టిన రోజే విషాదం.. బాలయ్య మృతికి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి.. కలచివేస్తోంది అంటూ!
టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో అనేక మంది టాలీవుడ్ మహామహులు అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం ప్రముఖ నటుడు, రచయిత, నిర్మాత బాలయ్య కన్నుమూశారు. అయితే ఆయన పుట్టినరోజు నాడే మరణించడం బాధాకరం. ఆయన మృతి చెందిన విషయం తెలుసుకున్న పలువురు సినిమా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆ వివరాలు

సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం
ప్రముఖ నటుడు బాలయ్య శనివారం ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 92 సంవత్సరాలు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు అని ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు సమాచారం అందించారు. దీంతో ఆయన మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

పుట్టినరోజు నాడే
తన సుదీర్ఘ సినీ కెరీర్లో నటుడిగా నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా ప్రతిభ చూపిన బాలయ్య.. పుట్టినరోజు నాడే కన్నుమూయడం విషాదకరం అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వైకుంఠపురం శివారు చావపాడు గ్రామంలో గురవయ్య, అన్నపూర్ణ దంపతులకు ఏప్రిల్ 9, 1930లో బాలయ్య జన్మించారు. ఆరోజుల్లోనే మెకానికల్ ఇంజినీరింగులో బీఈ పూర్తి చేసిన ఆయన మద్రాసు, కాకినాడ పాలిటెక్నిక్‌లలో లెక్చరర్‌గా కూడా పనిచేశారు.

300లకు పైగా చిత్రాల్లో
మద్రాసు గిండీ కళాశాలలో చదువుకునే రోజుల్లో నాటకాలలో నటించిన ఆయన 1958లో 'ఎత్తుకు పై ఎత్తు' సినిమాలో హీరోగా నటించారు ఆయన. ఆ తర్వాత 'భాగ్య దేవత', 'కుంకుమరేఖ' చిత్రాల్లో కూడా నటించారు. అలాగే ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'భూకైలాస్' చిత్రంలో శివునిగా కనిపించి మెప్పించారు. ఆ తర్వాత 'చెంచులక్ష్మి', 'పార్వతీ కల్యాణం' నుంచి మొదలు సుమారు 300లకు పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు.

కుమారుడు తులసీరామ్ కూడా
ఇక 1970లో అమృతా ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించిన ఆయన చెల్లెలి కాపురం (శోభన్ బాబు హీరో) నేరము - శిక్ష (కృష్ణ హీరో. కె. విశ్వనాథ్ దర్శకుడు) చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట (చిరంజీవి హీరో) లాంటి చిత్రాలు నిర్మించారు. అప్పట్లో ప్రభుత్వం 'చెల్లెలి కాపురం' చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసి నంది పురస్కారాన్ని బహుకరించింది. ఇక బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో హీరోగా నటించారు.

ప్రగాఢ సానుభూతి
సీనియర్ నటులు మన్నవ బాలయ్య గారి మరణ వార్త నన్నెంతగానో కలచివేసిందని నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. బాలయ్య గారు అద్భుతమైన నటులు. నాన్నగారితో కలిసి నటించారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా బాలయ్య గారు తన ప్రతిభ చూపారు. ఆయనతో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. వెండితెరపై హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా తన బహుముఖ ప్రతిభతో అశేష అభిమానుల్ని సంపాదించుకున్న ప్రఖ్యాత సీనియర్ నటులు మన్నవ బాలయ్య గారు కన్నుమూయడం చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు అని నారా లోకేష్ అన్నారు. బాలయ్య గారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని లోకేష్ పేర్కొన్నారు.

తీరని లోటు
ప్రముఖ నటులు, సినీ దర్శక నిర్మాత మన్నవ బాలయ్య గారి మరణం విచారకరం అని చంద్రబాబు పేర్కొన్నారు. 300కు పైగా చిత్రాల్లో నటించిన బాలయ్య గారి మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్న ఆయన బాలయ్య గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ప్రముఖ నటులు, దర్శకులు, అమృతా ఫిలిమ్స్ అధినేత.. శ్రీ బాలయ్య గారి మరణం.. చిత్ర పరిశ్రమకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నానని తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు, నటుడు వై. కాశీ విశ్వనాథ్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











