చక్రి మరణంపై అనుమానాలు, దాసరి ఏంచెబితే అదే...
హైదరాబాద్: సంగీత దర్శకుడు చక్రి మరణం తర్వాత ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆయన మరణం సహజ మరణమే అనేది ఇప్పటి వరకు అనుకుంటున్నాం. అయితే ఆయన భార్య మాత్రం చక్రి మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసారు. చక్రి కుటుంబ సభ్యులు తనను డబ్బు కోసం వేధిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
తనకు ఉన్న అనుమానాల గురించి వివరిస్తూ.... 'చక్రి చనిపోయే ముందురోజు మా అత్తగారింట్లో భోజనం చేశారు. చక్రి చనిపోగానే విలువైన డాక్యుమెంట్లు, ఆభరణాలు తీసేసుకున్నారు' అని ఆమె తెలిపారు. తన భర్త చనిపోగానే ఆయన కుటుంబ సభ్యులు తనను వేధించటం మొదలు పెట్టారని శ్రావణి చెప్పారు.

కుటుంబ వ్యవహారం కావటంతో తాము దాసరి నారాయణరావు గారిని కలవటం జరిగిందని, ఆయన ఏం చెబితే అలా చేసేందుకు తాను సిద్దంగా ఉన్నా... చక్రి కుటుంబ సభ్యులు మాత్రం సహకరించలేదన్నారు. ఆ తర్వాతే పోలీసుల్ని ఆశ్రయించటం జరిగిందన్నారు. చక్రి ఉన్నప్పుడు అంతా బాగా ఉండే వారని, ఇపుడు మాత్రం వారు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదన్నారు.
ఈ రోజు మళ్లీ చక్రి భార్య శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బు కోసం చక్రి తరుపు వారు నన్ను వేధిస్తున్నారంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు చక్రి కుటుంబంలోని ఏడుగురిపై కేసు నమోదు చేసారు. చక్రి డెత్ సర్టిఫికెట్ కూడా తనకు ఇవ్వలేదని ఆమె ఆరోపించారు.


Click it and Unblock the Notifications











