స్టూడియోల్లోకి కూడా రానీయలేదు.. ఓ రోజు ఎన్టీఆర్ కలిసి.. చలపతిరావు చెప్పిన ఆసక్తికర సంగతులు
తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో సీనియర్ నటులు ఉన్నారు. కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పుపొందిన ఆ నటులు కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో పాల్గొని చెప్పిన విషయాలు అమితమైన ఆసక్తిని కలిగిస్తుంటాయి. తాజాగా తెలుగు సీనియర్ నటుల్లో ఒకరైన చలపతిరావు 'అలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా తన కెరీర్‌కి సంబంధించిన విషయాలు ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని వివరించారు. మొదటి నుంచే తనకు నాటకాల పిచ్చి ఎక్కువని, చదువుకునే రోజుల్లో వరుసగా నాటకాలు వేస్తూ చాలా ఎంజాయ్ చేసేవాడినని తెలిపారు. ఇక పెళ్లైన కొత్తలోనే తనకు సినిమాల్లో నటించాలనే ఆలోచన రావడంతో ఆ ప్రయత్నాలు మొదలు పెట్టానని చెప్పారు చలపతి రావు.

ఆ సమయంలో చెన్నైలో తెలుగు సినిమా పరిశ్రమ ఉండేది. అయితే చెన్నైలో తెలిసిన వాళ్ళెవరూ లేకపోయినా, భార్యను వెంటబెట్టుకుని మొండి ధైర్యంతో చెన్నై వెళ్లానని చలపతి రావు అన్నారు. సినిమా అనేది ఒక మహా సముద్రం అని అక్కడికెళ్ళాక తనకు తెలిసిందని, కనీసం తనను ఎవ్వరూ స్టూడియోలోకి కూడా రానీయని పరిస్థితి ఎదుర్కొన్నానని ఆయన తెలిపారు.
అయితే అలాంటి పరిస్థితుల్లో ఒక రోజు ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి తన బాధ చెప్పి, ఏదైనా వేషం వుంటే ఇప్పించమని అడిగగా.. వెంటనే ఆయన ఓ వేషం ఇప్పించారని, అలా తన సినీ ప్రస్థానం మొదలైందని చలపతిరావు చెప్పారు. 'కథానాయకుడు' దర్శకుడితో చెప్పి ఆ సినిమాలో ఎన్టీఆర్ వేషం ఇప్పించారని, ఏ నాటికీ ఆయన చేసిన మేలు మరువను అని చలపతిరావు అన్నారు.


Click it and Unblock the Notifications











