ఇంకా విషాదంలోనే సూపర్‌స్టార్ కృష్ణ.. బాలయ్య, చంద్రబాబు పరామర్శ (ఫోటోస్)
ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల జూన్ 27న మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ అధినేత, మాజీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సినీ నటుడు బాలకృష్ణ ఆదివారం నానక్‌రాంగూడలోని వారి నివాసాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా విజయ నిర్మల మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కృష్ణను... చంద్రబాబు, బాలయ్య పరామర్శించిన సమయంలో నరేష్, మహేష్ బాబుతో పాటు బావ గల్లా జయదేవ్ కూడా ఇంట్లోనే ఉన్నారు.

విజయ నిర్మల లోటు తీర్చలేనిది
తెలుగు సినీ పరిశ్రమకు విజయ నిర్మల ఎంతో సేవ చేశారని, ఆమె లేని లోటు పరిశ్రమకు తీర్చలేనిదని ఈ సందర్భంగా చంద్రబాబు, బాలకృష్ణ అన్నట్లు తెలుస్తోంది. 44 సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకోవడం ద్వారా ఆమె పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోయిందన్నారు.

బాధలో ఉన్న సూపర్ స్టార్‌కు ఓదార్పు
దాదాపు 50 ఏళ్లకుపై తనతో జీవిత ప్రయాణం సాగించిన విజయ నిర్మల ఇక లేరనే విషయాన్ని సూపర్ స్టార్ కృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు. భార్య పోయిన దు:ఖాన్ని ఆపుకోలేక ఆయన కంటతడి పెట్టిన దృశ్యాలు అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులను కలిచివేశాయి. ఇలాంటి సమయంలోనే దైర్యంగా ఉండాలని చంద్రబాబు ధైర్యం చెప్పారు.

తెలుగు దేశం నుంచి పోటీ చేసిన విజయ నిర్మల
సినిమా రంగానికి చెందిన వారు రాజకీయాల్లోనూ అడుగు పెట్టి ప్రజా సేవ చేయడం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఈ క్రమంలో విజయ నిర్మల కూడా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. 1999లో తెలుగుదేశం పార్టీలో చేరి కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో ఆమె రాజకీయాలు తనకు అచ్చిరావని అర్థం చేసుకుని వైదొలగారు.

కృష్ణ, విజయ నిర్మల
విజయ నిర్మల నట ప్రస్థానం 7 ఏళ్ల వయసులోనే మొదలైంది. కృష్ణ, విజయ నిర్మల కలిసి నటించిన తొలి చిత్రం ‘సాక్షి'. 1967లో వచ్చిన ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ షూటింగ్ జరిగిన రెండేళ్లకు 1969లో కృష్ణ, విజయ నిర్మల పెళ్లి చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











