కేసీఆర్, చంద్రబాబులతో....బోయపాటి శ్రీను బ్యాలెన్సింగ్!
హైదరాబాద్: తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడి నేపథ్యంలో తెలుగు సినిమా ప్రముఖులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మంచి సంబంధాలు ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య మంత్రి అయిన కేసీఆర్‌కు ఇటీవల శుభాకాంక్షలు తెలియ జేస్తూ ప్రెస్ స్టేట్మెంట్ విడుదల చేసిన బోయపాటి...తాజాగా చంద్రబాబును కూడా విష్ చేసారు.
చంద్రబాబును విష్ చేస్తూ బోయపాటి ప్రకటన:
'రాష్ట్రం రెండు ముక్కలయ్యింది. ఆంధ్రుల ఆశలు ఆవిరయ్యాయి., అయితేనేం ఇపుడు వారి భవిష్యత్‌కు డోకా ఏమీ లేదు. ప్రణాళికాబద్దమైన పరిపాలనతో బంగారు బాట వేసేందుకు ఆయన వచ్చేసారు. నారా చంద్రబాబు నాయుడిగారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని, ఆయన నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కలలు సాకారమవుతాయని ఆశిస్తున్నాను. చంద్ర బాబు నాయుడుగారికి ఆయన మంత్రి వర్గానికి నా అభినందనలు.

కేసీఆర్ గురించి, అమర వీరుల గురించి బోయపాటి ఇలా...
''తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ కేసీఆర్ గారికి మరియు ఆయన కేబినెట్‌కు నా శుభాకాంక్షలు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది ద్విగుణీకృతం కావాలని, రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగు వారిగా ప్రజలందరూ సోదర భావంతో కలిసే ఉండాలని మనస్తూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలు అర్పించిన అమర వీరులకు నా జోహార్లు.
బోయపాటి సినిమాల విషయానికొస్తే...
బాలయ్యతో 'లెజండ్' సినిమా తెరకెక్కించి మళ్లీ ఫాంలోకి వచ్చిన బోయపాటి శ్రీను ఆ తర్వాత మెగాహీరో రామ్ చరణ్ తో సినిమా ప్లాన్ చేసుకున్నాడు. రామ్ చరణ్ నుండి కూడా సుముఖరావడంతో బోయపాటి ఈ విషయాన్ని పలు సందర్భాల్లో వెల్లడించారు.
అయితే ఈచిత్రం పట్టాలెక్కే పరిస్థితి లేదని, బోయపాటికి రామ్ చరణ్ హ్యాండిచ్చినట్లే అని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రంలో నటిస్తున్న రామ్ చరణ్ ఈ చిత్రం వీలైనంత త్వరగా పూర్త చేసి సెప్టెంబర్ నుంచి శ్రీను వైట్ల సినిమా చేస్తున్నట్టు ప్రకటన వెలువడింది. ఈ ప్రకటనతో రామ్ చరణ్ -బోయపాటి సినిమా ఉంటుందా? ఉండదా? అనే విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











